న్యూఢిల్లీ: టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర్ సెహ్వాగ్, బ్రిటిష్ జర్నలిస్ట్ పీర్స్ మోర్గాన్‌ల మధ్య సంబంధం ఒకరి గురించి మరొకరు చెప్పుకోలేకుండా ఉండలేరేమో. రియో ఒలింపిక్స్‌లో భారత్ పతకం సాధించిన సందర్భంగా వీరిద్దరి మధ్య ట్విట్టర్‌లో మాటల యుద్ధమే నడిచింది.
అయితే తాజాగా మళ్లీ వీరిద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా మాటల తూటాలు పేలాయి. కబడ్డీ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా మంగళవారం (అక్టోబర్ 18) రాత్రి భారత్-ఇంగ్లాండ్‌ల మధ్య జరిగిన పోరులో భారత్ 69-18తో ఇంగ్లాండ్‌పై భారీ విజయం సాధించింది.
ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించారు: సెమీస్‌లోకి టీమిండియా
ఈ విజయంతో వరుసగా మూడు విజయాలను సొంతం చేసుకున్న భారత జట్టు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సెహ్వాగ్ తన ట్విట్టర్‌లో 'వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ మళ్లీ ఓటమి (loose) పాలైంది. స్పాట్ మాత్రమే మారింది. ఈసారి కబడ్డీ. 69-18తో ఇంగ్లాండ్‌పై భారత్ విజయం సాధించింది. భారత్‌కు ఆల్ ద బెస్ట్' అంటూ ట్వీట్ చేశాఢు.
సెహ్వాగ్ ట్వీట్‌కు పీర్స్ మోర్గాన్ వెంటనే స్పందించాడు. తన ట్వీట్‌లో స్పెల్లింగ్ తప్పి ఉందంటూ అది loose కాదు lose అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఈసారి మోర్గాన్ ట్వీట్‌కు సెహ్వాగ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే మోర్గాన్ ట్వీట్‌కు పలువురు నెటిజన్లు స్పందించడం విశేషం.
రియో ఒలింపిక్స్ 2016లో పతకాల విషయంలో పీర్స్ మోర్గాన్ వెటకారం చేయగా, వీరేంద్ర సెహ్వాగ్ గట్టి కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. రెండు పతకాలు గెలిచిన భారత్ ఇంత పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటుందా అని పీర్స్ మోర్గాన్ ట్వీట్ చేశాడు.

దీనిపై స్పందించిన సెహ్వాగ్.. దానికి సమాధానంగా సెహ్వాగ్ మేం చిన్ని చిన్ని సంతోషాలను కూడా గొప్పగా జరుపుకొంటామని, కానీ క్రికెట్‌ను కనిపెట్టిన ఇంగ్లాండ్ ఇప్పటికీ ప్రపంచ కప్ నెగ్గలేకపోయిందని, అయితే ఇంకా ఆ దేశం క్రికెట్ ఆడుతుండటం సిగ్గుచేటు కదా అని రీట్వీట్ చేశాడు.
ఆ తర్వాత, పియర్స్ మోర్గాన్.. నేను రూ.10లక్షలు పందెం కాస్తానని, భారతదేశం మరో ఒలింపిక్ స్వర్ణం గెలిచేలోపు ఇంగ్లాండ్ ప్రపంచకప్ నెగ్గుతుందని, సవాల్‌కు సిద్ధమేనా అని ట్వీట్ చేశాడు. దానికి సెహ్వాగ్ మాత్రం తనదైన శైలిలో కొందరిని దురదృష్టం మళ్లీ మళ్లీ వెంటాడుతూనే ఉంటుందని, వాళ్లు ఎంత ప్రయత్నించినా లాభం లేదంటూ.. హాహాహా.. అంటూ నవ్వులు కురిపించాడు.
ఆ తర్వాత పారాలింపిక్స్‌లో అంచనాల్లేకుండా బరిలోకి దిగిన 21ఏళ్ల మారియప్పన్ తంగవేలు హైజంప్ విభాగంలో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు. రియో పారాలింపిక్స్‌లో భారత్ స్వర్ణం సాధించడాన్ని పీర్స్ మోర్గాన్ తన ఖాతాలో వేసుకున్నాడు. తన వల్లే భారత్ గెలిచిందన్నాడు.