న్యూఢిల్లీ: నాలుగు టెస్టుల సిరీస్ ఆడేందుకు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన విరాట్ కోహ్లీ సేన కొత్త కోచ్ అనిల్ కుంబ్లే నేతృత్వంలో కరీబియన్ సముద్ర జలాల్లో ఎంజాయ్ చేస్తోంది. సెయింట్ నేవీస్ ఐస్‌లాండ్‌లో టీమిండియా ఆటగాళ్లు ఎంజాయ్ చేస్తున్న పలు ఫొటోలను విరాట్ కోహ్లీ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.
అనిల్ కుంబ్లే కూడా జట్టుతో కలిసి ఉత్సాహంగా పాల్గొంటున్నాడు. ఆటగాళ్లు బీచ్‌ల సందర్శనతో పాటు కరీబియన్ అందాలను వీక్షిస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. బోట్లలో షికారు, గుర్రాలపై స్వారీ చేస్తున్న పలు ఫొటోలను కోహ్లీతోపాటు బిసిసిఐ తన అధికారిక సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

సముద్రంపై బోటులో షికారుకెళ్లిన క్రికెటర్లు.. అనంతరం అక్కడే ఈత కొడుతూ ఉత్సాహంగా వాలీబాల్ ఆడారు. తన జట్టు సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నట్లు కోహ్లీ పేర్కొన్నాడు. కాగా, క్రికెటర్లు ఇలా నీటిలో సాహసోపేత విన్యాసాలు చేయడం కూడా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని కుంబ్లే నమ్ముతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే వెస్టిండీస్ ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో జరిగిన రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌ను టీమిండియా డ్రాగా ముగించిన విషయం తెలిసిందే. గురువారం నుంచి రెండో వార్మప్ మ్యాచ్ జరగనుండగా.. వెస్టిండీస్ జాతీయ జట్టుతో జులై 21న తొలి టెస్టు ఆరంభం కానుంది.