రాంచీ: భారత్, శ్రీలంకల మధ్య రెండో ట్వంటీ20 జరగనున్న నేపథ్యంలో టీమిండియా జట్టు సభ్యులైన హార్భజన్ సింగ్, సురేష్ రైనా టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ముద్దుల కూతురు జీవాతో దిగిన సెల్ఫీని రైనా తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.
కెప్టెన్ ధోని గురువారం రాత్రి తన ఇంట్లో ఇచ్చిన విందుకు టీమిండియాను ఆహ్వానించాడు. టీ20 నేపథ్యంలో రాంచీకి టీమిండియా జట్టు చేరుకుంది. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లు సురేష రైనా, హార్భజన్ సింగ్ ధోని కూతురు జీవాతో కాసేపు సరదాగా గడిపారు.

అయితే ఈ ఫోటోలో టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ ధోని లేకపోవడం విశేషం. ఈ ఫోటోలో జీవా ఎంతో అందంగా కనిపిస్తుంది. భారత్-శ్రీలంక జట్ల జరగనున్న రెండో టీ20 ధోని స్వస్థలమైన రాంచీలో మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇక ధోని భార్య సాక్షి సామాజిక మాధ్యమాల్లో చాలా చురుకుగా ఉంటారు.
ధోని ముద్దుల కూతురు జీవాకు చెందిన ఫోటోలు, వీడియోలను అభిమానులకు ఎప్పటికప్పుడు ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల ద్వారా షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ధోని ఆస్టేలియాలో వరల్డ్ కప్ ఆడుతున్న సమయంలో ఫిబ్రవరి 6, 2015న జీవా పుట్టిన సంగతి తెలిసిందే.