
హైదరాబాద్: అంతర్జాతీయ టెస్టు హోదా దక్కించుకున్న తర్వాత ఐర్లాండ్ తన తొలి టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. మే 11 నుంచి 15 వరకు మాలాహైడ్ సీసీలో పాకిస్థాన్‌తో ఐర్లాండ్ తన తొలి టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఐర్లాండ్ తొలి టెస్టు జట్టుకు సంబంధించిన ఫోటోని ఐసీసీ ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
అంతేకాదు హిస్టరీ బుక్స్‌లో నిలిచిపోయే ఫోటో అంటూ క్యాప్షన్ కూడా పోస్టు చేసింది. పెద్ద జట్లపై సంచలన విజయాలు సాధించడంతో పాటు, అంచనాలకు మించి రాణించడంతో అఫ్ఘనిస్థాన్, ఐర్లాండ్ జట్లకు గతేడాది ఐసీసీ టెస్టు హోదా కల్పిస్తూ, లండన్‌లో జరిగిన ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది.
దీంతో పాటు ఆప్ఘనిస్థాన్, ఐర్లాండ్‌లకు పూర్తి సభ్యత్వాన్ని కూడా ఐసీసీ ఇచ్చింది. ఈ రెండు జట్ల చేరికతో టెస్టు మ్యాచ్‌లు ఆడే దేశాల సంఖ్య 12కు చేరింది. పాకిస్థాన్‌తో జరగనున్న తొలి టెస్టులో విజయం సాధించడమే లక్ష్యంగా ఐర్లాండ్ జట్టు ఆటగాళ్లు తీవ్రంగా నెట్స్‌లో శ్రమిస్తున్నారు.
మరోవైపు టెస్టు హోదా దక్కించుకున్న ఆప్ఘనిస్థాన్ తన తొలి టెస్టును టీమిండియాతో ఆడనుంది. జూన్‌లో జరగనున్న ఈ టెస్టుకు బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఆప్ఘన్‌తో జరిగే చారిత్రాత్మక టెస్టుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. అతడి స్థానంలో కరుణ్ నాయర్‌కు సెలక్టర్లు చోటు కల్పించారు.
ఇంగ్లాండ్ పర్యటనను దృష్టిలో పెట్టుకుని అక్కడి స్థానిక పరిస్థితులు అలవాటు పడేందుకు విరాట్ కోహ్లీ కౌంటీ క్రికెట్ ఆడనున్నాడు. ఇందు వల్లే కోహ్లీ ఆప్ఘన్ టెస్టుకు దూరమయ్యాడు. ఇదిలా ఉంటే ఐర్లాండ్‌కు 2005లో ఆఫ్ఘనిస్థాన్‌కు 2009లో వన్డే హోదా దక్కిందన్న సంగతి తెలిసిందే.