హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కుక్కలంటే ఎంతో ఇష్టం. క్రికెట్ మ్యాచ్‌లు ఆడటానికి ఎక్కడికెళ్లినా.. అక్కడ కుక్కలు కనిపిస్తే చాలు వాటితో ఆడుకోవడం మనం గతంలో అనేక సార్లు చూశాం. తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా ప్రస్తుతం బెంగళూరులో ఉన్న విరాట్ కోహ్లీ నగరంలో ఉన్న ఓ అనాథ కుక్కల శరణాలయానికి వెళ్లాడు.
దాని పేరు కేర్. కేర్ అంటే చార్లీస్ యానిమల్ రెస్క్యూ సెంటర్. అయితే ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆ సెంటర్ నిర్వాహకులకు కూడా తెలియకుండా విరాట్ కోహ్లీ అక్కడికి వెళ్లాడు. దీంతో తమ సెంటర్‌లో విరాట్ కోహ్లీని చూసిన అక్కడి వాళ్లంతా షాక్‌కు గురయ్యారు.
అక్కడ ఉన్న కుక్కలతో విరాట్ కోహ్లీ కాసేపు ఆడుకున్నాడు. అంతేకాదు అక్కడ వివిధ రోగాలతో బాధపడుతున్న 15 కుక్కలను విరాట్ కోహ్లీ దత్తత తీసుకున్నాడు. ఈ విషయాన్ని కేర్ సెంటర్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కేర్ నిర్వహకులు ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.
గతేడాది ఐపీఎల్‌లో రన్నరప్‌గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్‌లో ఇంకా మెరుగైన ఆటతీరుని ప్రదర్శించలేదు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒక మ్యాచ్‌లోనే విజయం సాధించింది.