డే 1: శునకం రాకతో లేటైన కోహ్లీ, పుజారాల సెంచరీలు
విశాఖపట్నం: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విశాఖపట్నం ఆతిథ్యం ఇస్తున్న తొలి టెస్ట్. అంతేకాదు తన కెరీర్‌లో 50వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న కెప్టెన్ కోహ్లీ అభిమానులకు గుర్తుండిపోయేలా చేశాడు. వన్డేల్లో ఇక్కడ రెండు సెంచరీలు చేసిన కోహ్లీ తొలి టెస్టులో భారీ సెంచరీని సాధించాడు.
కోహ్లీకి తోడు పుజారా కూడా సెంచరీతో చెలరేగడంతో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో తొలిరోజు టీమిండియా బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం కొనసాగింది. ఐదు టెస్టుల సిరిస్‌లో భాగంగా గురువారం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో మొదలైన టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలిరోజు 90 ఓవర్లలో నాలుగు వికెట్లకు 317 పరుగులు చేసింది.

226 పరుగుల రికార్డు భాగస్వామ్యం
మూడో వికెట్‌కు 226 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పిన కోహ్లీ-పుజారా భారత్‌ను పటిష్ట స్థితిలో నిలిపారు. టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు మురళీ విజయ్ (20), లోకేష్ రాహుల్ (0) తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరారు.

ఆదుకున్న పుజారా, కోహ్లీలు
ఓపెనర్ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును పుజారా, కోహ్లీ ఆదుకున్నారు. పేసర్లతో పాటు స్పిన్నర్లను కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. రెండో వికెట్‌కు 226 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జోడించిన తర్వాత, ఆండర్సన్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ జానీ బెయిర్‌స్టో క్యాచ్ పట్టడంతో పుజారా అవుటయ్యాడు.

నైట్ వాచ్‌మన్‌గా రవిచంద్రన్ అశ్విన్
అతను 204 బంతులు ఎదుర్కొని, 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 119 పరుగులు సాధించాడు. ఆజింక్య రహానే 23 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద పుజారా మాదిరిగానే ఆండర్సన్ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి మొదటి రోజు ఆట ముగిసేందుకు మరో ఒకటిన్నర ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నందున నైట్‌వాచ్‌మన్ రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్‌కు వచ్చాడు.

90 ఓవర్లలో భారత్ 317/4
90 ఓవర్లలో భారత్ నాలుగు వికెట్లకు 317 పరుగులు చేసింది. కోహ్లీ 214 బంతుల్లో 151, అశ్విన్ 9 బంతుల్లో ఒకటి చొప్పున పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నారు. గాయం నుంచి కోలుకొని రీ ఎంట్రీ ఇచ్చిన అండర్సన్ మూడు వికెట్లతో రాణించగా, స్టువర్ట్ బ్రాడ్ ఒక వికెట్ తీశాడు.

14 ఏళ్ల తర్వాత..
ఇంగ్లాండ్‌పై భారత్ మూడో వికెట్‌కు కనీసం సెంచరీ భాగస్వామ్యం ఈ టెస్టుకు ముందు చివరిసారి 2002లో నమోదైంది. హెడింగ్లేలో జరిగిన టెస్టులో రాహుల్ ద్రవిడ్, సచిన్ తెండూల్కర్ 150 పరుగులు జోడించారు. 14 ఏళ్ల తర్వాత పుజారా, కోహ్లీ పార్ట్‌నర్‌షిప్‌లో 226 పరుగులు లభించాయి.

విశాఖ టెస్టులో కుక్క హడావుడి
టెస్టు మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియంలోకి ఓ అనుకోని అతిథి విచ్చేసింది. దీంతో మైదానంలోని అంపైర్లు రెండో సెషన్ టీ విరామం ముందుగానే ఇచ్చారు. టీమిండియా బ్యాట్స్‌మెన్లు కోహ్లీ( 91 వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు), పుజారా (97 నాటౌట్) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు ఓ కుక్క మైదానంలోకి ప్రవేశించింది.

కోహ్లికి అచ్చొచ్చిన స్టేడియం
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశాఖ స్టేడియం అచ్చొచ్చిందనే చెప్పాలి. ఇక్కడ ఆడిన ప్రతిసారీ అతను కనీసం అర్ధ సెంచరీ సాధించాడు. అన్ని ఫార్మెట్స్‌లో కలిపి అతను వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌లో 118, 117, 99, 65 చొప్పున పరుగులు చేశాడు. ఈ టెస్టులో 151 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మొత్తం మీద కెరీర్‌లో 50వ టెస్టు ఆడుతున్న కోహ్లీ 14వ సెంచరీని నమోదు చేశాడు.

మూడో వికెట్‌కు 226 పరుగుల భాగస్వామ్యం
పుజారాతో కలిసి అతను మూడో వికెట్‌కు 226 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ-పుజారా 226 పరుగుల భాగస్వామ్యం ఇంగ్లండ్‌పై మూడో వికెట్‌కు మూడో అత్యధికం. క్రీజ్‌లో 5 గంటల, 52 నిమిషాలు నిలిచిన కోహ్లీ తన మారథాన్ ఇన్నింగ్స్‌లో 15 బౌండరీలు, రెండు సిక్సర్లు కొట్టాడు.

3000 పరుగుల మైలురాయి దాటిన పుజారా
ఈ టెస్టు మ్యాచ్‌లో పుజారా, విజయ్ 3000 పరుగుల మైలురాయి దాటారు. ఈ మార్కు చేరడానికి పుజారాకు 40, విజయ్‌కు 44 టెస్టులు అవసరమయ్యాయి. పుజారా వరుసగా మూడు టెస్టుల్లోనూ సెంచరీలు సాధించాడు. టెస్టుల్లో ఓవరాల్‌గా 10 శతకాలు చేసిన అతనికి ఇంగ్లండ్‌పై ఇది నాలుగో సెంచరీ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications