రాజ్‌కోట్: టీమిండియా ఆటగాడు, గుజరాత్ లయన్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన కుటుంబంలోకి ఓ కొత్త బేబీని ఆహ్వానించాడు. పెళ్ళై నెలరోజులైనా కాలేదు.. అప్పుడే న్యూ బేబీ అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఆ న్యూ బేబీ అనేది ఓ గుర్రం పిల్ల.
ఏప్రిల్ 17న స్థానిక వ్యాపారి కూతురు రీవా సోలంకిని జడేజా వివాహమాడిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత జరిగిన బరాత్‌లో జడేజా తల్వార్ తిప్పుతూ హల్‌చల్ చేశాడు. అతడి తల్వార్ డాన్స్ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిపోయింది.

తాజాగా, ఇంట్లోకి కొత్త బేబీ వచ్చిందంటూ పోస్ట్ పెట్టి తాజాగా మరోసారి జడేజా వార్తల్లోకెక్కాడు. జంతు ప్రేమికుడైన రవీంద్ర జడేజా తనకు ఇష్టమైన ఓ గుర్రాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ గుర్రానికి 'జంకీ' అని పేరు పెట్టాడు. ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నాడు.
కాగా, జంకీకి పుట్టిన గుర్రానికి 'వారి' అని పిలుచుకుంటున్నాడు. అంతేగాక, 'న్యూ బేబీకి ఫాంహౌస్ వెల్‌కమ్' అంటూ గుర్రంపై ఇష్టాన్ని చాటుకున్నాడు. ఆ గుర్రాలతో ఫొటోలు దిగిన వాటిని తన ఇన్‌స్టాగ్రాంలో జడేజా పోస్ట్ చేశాడు.
ఐపీఎల్ మ్యాచులతో బిజీగా ఉండటం వల్ల 'వారి'తో కలిసి ఫొటో దిగడానికి కాస్త ఎదురుచూడాల్సి వచ్చిందని, ఎట్టకేలకు ఫొటో దిగాను అని తన పోస్ట్‌లో జడేజా చెప్పుకొచ్చాడు.