విశాఖపట్నం: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ బౌలర్ నాథన్ కాల్టర్ నైల్ వేసిన బౌన్సర్‌కి రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్(ఆర్‌పీఎస్) బ్యాట్స్‌మన్ జార్జ్ బెయిలీ హెల్మెట్ ఎగిరిపోయి కిందపడింది.
ఆస్ట్రేలియాకు చెందిన 33ఏళ్ల బెయిలీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో నైల్ వేసిన బౌన్సర్ వేగంగా వచ్చి హెల్మెట్‌కు తాకడంతో అది ఎగిరి వికెట్ల పక్కన కిందపడిపోయింది. ఏం జరిగిందో తెలియక బెయిలీ చుట్టూ తిరిరిపోయాడు.
ఆ తర్వాత వికెట్లకు తగలకుండా తన బ్యాట్‌తో హెల్మెట్‌ను పక్కకు జరిపాడు బెయిలీ. ఢిల్లీ డేర్‌డెవిల్స్ మిగితా ఆటగాళ్లు వచ్చి బెయిలీని పరామర్శించారు. అతనికి ఎలాంటి గాయం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కాగా, బ్రిటీష్ ప్రమాణాలకు అనుగుణంగా వున్న కొత్త హెల్మెట్‌ను ధరించినందుకు ఆనందంగా ఉందని బెయిలీ ఐపిఎల్ అధికారులకు తెలిపాడు. అయితే, తన హెల్మెట్ వికెట్లకు తగలకపోవడంతో పలువురు ఢిల్లీ ఆటగాళ్లు అంసతృప్తికి గురయ్యారని నవ్వుతూ తెలిపాడు బెయిలీ.
కాగా, గత ఏడాది ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఫిల్ హ్యూస్ వేగవంతంగా వచ్చిన బంతి తగిలి మైదానంలోనే ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అతని మరణంతో క్రికెట్‌లో ఆటగాళ్ల హెల్మెట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.