దుబాయ్: టెన్నిస్ సూపర్ స్టార్ రోజర్ ఫెదరర్ భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్ల అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. భారత్ - పాక్ మ్యాచ్‌కు ముందు ఫెదరర్ భారత జెర్సీతో కూడిన ఫోటోను ఫేస్‌బుక్‌లో అప్ లోడ్ చేశాడు. దీనిపై అతను క్షమాపణలు చెప్పాడు!
ఆంగ్ల మాధ్యమాలలో వస్తున్న వార్తల మేరకు.. తాను భారత జట్టుకు మద్దతు ఇవ్వలేదని చెప్పాడు.
ఫెదరర్ భారత్‌కు మద్దతిచ్చారనే వార్తల నేపథ్యంలో పాకిస్తాన్, భారత్ అభిమానుల మధ్య కొంత వాగ్వాదం జరిగింది. దీంతో ఫెదరర్ దాని పైన వివరణ ఇచ్చారని తెలుస్తోంది.
ఫెదరర్ 17 సార్లు గ్రాండ్ స్లామ్ గెలిచాడు. నైక్ స్పోర్ట్స్ వియర్‌కు ప్రచారకర్తగా ఉన్నాడు. అదే బ్రాండ్ భారత క్రికెట్ టీంకు స్పాన్సర్‌గా ఉంది. ఈ నేపథ్యంలో ఆ ఫోటోను ట్విట్టర్లో నైక్ ప్రమోట్ చేసింది. అయితే, ఆ ఫోటోను తాము వాణిజ్య కోణంలో పెట్టలేదని పేర్కొంది.

అనంతరం ఫేస్‌బుక్‌లోని ఆ ఫోటోను ఫెదరర్ చూశాడు. తాను భారత ప్లేయర్లను కలిశానని, వారితో కాసేపు గడిపానని, ఆ సమయంలో వారు తనకు ఆ షర్ట్ ఇచ్చారని ఫెదరర్ చెప్పాడు.
తాను దక్షిణాఫ్రికాకు మద్దతు పలుకుతానని, అది ప్రతి ఒక్కరికీ తెలుసునని చెప్పాడు. ఇలాంటివి (ఫేస్‌బుక్‌లో ఫోటో పెట్టడంపై) ఘర్షణ వాతావరణానికి దారి తీయవద్దని, దీని పట్ల తాను క్షమాపణలు కోరుతున్నానని చెప్పాడని వార్తలు వస్తున్నాయి.
కాగా, ఆ ఫోటో పాకిస్తాన్‌లోని ఫెదరర్ అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. కేంబ్రిడ్జిలో చదువుతున్న ఓ విద్యార్థి ఓ ఇంగ్లీష్ పత్రికలో.. ఫెదరర్ పైన తన ఆగ్రహం గురించి వివరించాడు. ఫెదరర్ పాకిస్తాన్ అభిమానులను మోసం చేశాడని పేర్కొన్నాడని సమాచారం. ఫెదరర్ భారత్‌కు మద్దతు పలకడం సరికాదని అభిప్రాయపడ్డాడు.
కాగా, ఫెదరర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌కు మంచి స్నేహితుడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ సమయంలో పలువురు భారత క్రికెటర్లు ఆయనను కలిశారు. అందులో విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. కోహ్లీ అతనితో దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు.