

లండన్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఇంగ్లాండ్ టూర్‌లో బిజీబిజీగా ఉన్నాడు. ఒకరోజు నెట్స్‌లో భారత బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ వేస్తే.. రెండో టెస్టు రెండో రోజు స్టేడియం బయట రేడియోలు అమ్ముతూ కనిపించాడు. అయితే లార్డ్స్ టెస్ట్ మూడో రోజు ఆటలో అర్జున్ టెండూల్కర్ కాసేపు విరామం తీసుకున్నాడు. శ్రీలంక జట్టుతో యూత్ టెస్టు సిరీస్‌లో అవకాశం కోల్పోయాడు.
అయినప్పటికీ సీనియర్ జట్టుతో పాటు మైదానంలో కనిపిస్తూ.. ఏదో రకంగా వార్తల్లోకెక్కుతున్నాడు. ఈ క్రమంలోనే లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టు మూడో రోజు బౌండరీ లైన్ అవతల ఫీల్డ్‌పై పడుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాడు. ఇలా రేడియోలు అమ్ముతూ.. పిచ్ మీదే పడుకుని విశ్రాంతి తీసుకుంటున్నప్పటి ఫొటోలు సోషల్ మీడియాలోవైరల్ అవుతున్నాయి. అయితే ఇలా నేలమీద పడుకున్న సన్నివేశం టీమిండియా మాజీ కెప్టెన్ ధోనిని తలపించిందంటూ కితాబిస్తున్నారు నెటిజన్లు.
2017నాటి శ్రీలంక టూర్‌లో ధోని కూడా ఇలాగే నేలపై కునుకు తీశాడు. అప్పటి మ్యాచ్‌లో మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులు వాటర్ బాటిళ్లు విసిరి... అల్లరి చేస్తూ ఆందోళనకు దిగారు. ఆ సమయంలో ఆటకు కాసేపటి వరకూ అంతరాయం కలిగింది.
ఆ గ్యాప్‌లో ధోనీ నేలపై పడుకుని చిన్నపాటి కునుకు తీశాడు. ఆనాటి ఫొటోలను, వీడియోలను ట్వీట్ చేస్తూ.. ధోనికి, అర్జున్ టెండుల్కర్‌కు నెటిజన్లు ముడిపెడుతున్నారు. ఈ మధ్యనే టీమిండియా అండర్ 19 జట్టులో లెఫ్ట్ హ్యండ్ స్పిన్నర్‌గా అరంగ్రేటం చేసిన అర్జున్ టెండూల్కర్ మూడు వికెట్లు తీయగలిగాడు. బ్యాటింగ్ విషయంలో సచిన్ టెండూల్కర్ లాగే మొదటి మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. రెండో మ్యాచ్‌లో 14 స్కోరు సాధించాడు.