
మెల్‌బోర్న్: ఆసీస్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ పీటర్ సిడెల్ అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్ బై చెప్పాడు. ఆసీస్ తరఫున 11 ఏళ్లు క్రికెట్ ఆడిన 35 ఏళ్ల సిడెల్ తన రిటైర్మెంట్‌ను ఆదివారం ప్రకటించాడు. తాను రిటైర్మెంట్ తీసుకోవడానికి ఇదే తగిన సమయమని భావించి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు సిడెల్ తెలిపాడు. ఆసీస్ జట్టుకు ఆడటాన్ని గొప్పగా భావించానని సిడెల్ పేర్కొన్నాడు.
'నా చిన్నతనంలో నాలో క్రికెట్ పరంగా సూపర్ టాలెంట్ ఏమీ లేదు. ఆసీస్‌కు ఆడాలనే ప్రయత్నంలో ఎక్కువగా శ‍్రమించే లక్ష్యాన్ని చేరుకున్నా. బ్యాగీ గ్రీన్‌ను ధరించడం గొప్పగా భావించా. ఒక్కసారి ఆసీస్‌కు ప్రాతినిథ్యం వహిస్తే సరిపోతుందని అనుకున్నా. యాషెస్ సిరీస్ వంటి ప్రతిష్టాత్మక సిరీస్ కూడా ఆడా. వీడ్కోలుకు సరైన సమయం ఎప్పుడో తెలుసుకోవడం ఎంతో కష్టం. క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని గతంలో అనుకున్నా. కానీ, మరోసారి ఆసీస్ తరఫున ఆడాలని అనిపించింది. ఇటీవల యాషెస్‌లో ఆడా. అది ఎంతో బాగుంది. వీడ్కోలుకు ఇదే సరైన సమయం అని అనిపిస్తుంది' అని సిడిల్ పేర్కొన్నాడు.
'నేను క్రొకెట్ ఆడుతున్న సమయంలో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు అరంగేట్రం చేశారు. ఆపై వారు క్రికెట్ నుంచి వీడ్కోలు కూడా తీసుకున్నారు. వారు నా కంటే చాలా వయసులో ఉన్నారు. వారి వ్యక్తిగత కారణాల వల్ల క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. నేను జట్టు నుంచి ఉద్వాసన గురైన ప్రతీసారి నాలో సత్తాను నిరూపించుకుని మళ్లీ జట్టులోకి వచ్చా' అని సిడెల్ అన్నాడు. న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపికైన సిడెల్‌కు రెండో టెస్టు తుది జట్టులో చోటు దక్కలేదు.
2008లో మొహాలి వేదికగా భారత్‌తో ఆడిన తొలి టెస్టుతో సిడిల్ తన అంతర్జాతీయ కెరీర్ మొదలుపెట్టాడు. తన తొలి వికెట్ భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ది. 2010లో తన పుట్టినరోజున సిడిల్ హ్యాట్రిక్ తీసాడు. ఇంగ్లాండ్‌పై ఈ ఘనత సాధించాడు. ఆసీస్ తరఫున సిడిల్ 67 టెస్టులు, 20 వన్డేలు, రెండు టీ20లు ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 221 వికెట్లు, వన్డేల్లో 17 వికెట్లు, టీ20ల్లో మూడు వికెట్లు సాధించాడు.
అంతర్జాతీయ కెరీర్‌లో 67 టెస్టులు ఆడిన సిడెల్.. ఐదు వికెట్ల మార్కును ఎనిమిదిసార్లు చేరాడు. ఆసీస్ తరఫున 13వ అత్యధిక వికెట్ టేకర్‌గా సిడెల్ ఉన్నాడు. 2010లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 26వ బర్త్ డే రోజున హ్యాట్రిక్ సాధించాడు. ఆసీస్ తరఫున చివరగా యాషెస్ సిరీస్‌లో సిడెల్ పాల్గొన్నాడు.