పెషావర్: భారత్-పాక్ మ్యాచ్ అంటేనే ఆ ఆసక్తి వేరు. ఐసీసీ వరల్డ్ టీ20లో భాగంగా కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఈరోజు భారత్-పాక్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో మ్యాచ్‌ని సాధ్యమైనంత ఎక్కువ మంది అభిమానులు చూసేలే భారత్, పాక్ దేశాలు ఏర్పాట్ల చేసుకుంటున్నాయి.
ఇందులో భాగంగా ఈ మ్యాచ్‌ను క్రికెట్ అభిమానులు వీక్షించేందుకు గాను పాకిస్థాన్‌లోని పెషావర్ పట్టణంలో ఏకంగా సినిమా థియేటర్లలో శనివారం లైవ్ మ్యాచ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లైవ్ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే అభిమానులు రూ. 100 చెల్లించి సినిమా థియేటర్ల వద్ద టికెట్లు కొనుగోలు చేస్తున్నట్టు డాన్ ఆన్‌లైన్ పత్రిక వెల్లడించింది.
ముఖ్యంగా యువతను ఆకర్షించేందుకు సినిమా థియేటర్ల వద్ద పెద్ద సైజు పోస్టర్లు, బ్యానర్లు పెట్టినట్టు అందులో పేర్కొంది. వీటితో పాటు పాకిస్థాన్‌లోని హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రభుత్వేతర సంస్థలు కూడా ప్రజలందరూ భారత్-పాక్ లైవ్ మ్యాచ్‌ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇటీవల ఆసియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌ని కూడా ఇదే విధంగా ఏర్పాట్లు చేసినట్టు ఓ క్రికెట్ అభిమాని తెలిపాడు. భారత్-పాక్ మ్యాచ్ కోసం పాకిస్థాన్ విద్యార్థులు వాసిం, ఇజాజ్, ఆసిఫ్‌లు ఎంతో ఆతృతగా ఉన్నట్లు వివరించారు.
అంతేకాదు భారత్, పాక్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఆయా సినిమా థియేటర్లలో అంతరాయం లేకుండా విద్యుత్ తప్పనిసరిగా సరఫరా చేయాలని క్రికెట్ అభిమానులు పాక్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.