సరిగ్గా 18 ఏళ్ల క్రితం ఇదే రోజున కుంబ్లే 'ఫర్ఫెక్ట్ టెన్'
హైదరాబాద్: ఫిబ్రవరి 7... లెజెండరీ ఇండియన్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే జీవితంలో మరిచిపోలేని రోజు. సరిగ్గా 18 ఏళ్ల క్రితం ఇదే రోజున అనిల్ కుంబ్లే తన బౌలింగ్‌తో దాయాది దేశమైన పాకిస్థాన్‌పై రెచ్చిపోయి పదికి పది వికెట్లు తీసిన అరుదైన మైలురాయిని తన ఖాతాలో వేసుకున్నాడు.
అది ఫిబ్రవరి 7, 1999వ సంవత్సరం... పాకిస్థాన్‌తో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన టె్సటు మ్యాచ్‌లో అనిల్ కుంబ్లే మ్యాజిక్ చేశాడు. 26.3 ఓవర్లు వేసిన అనిల్ కుంబ్లే 74 పరుగులిచ్చి 10 వికెట్లు తీశాడు. తద్వారా టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ అరుదైన ఘనతను సాధించిన రెండో బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.
అంతక ముందు ఇంగ్లాండ్ బౌలర్ జిమ్ లాకర్ ఈ 'ఫర్ఫెక్ట్ టెన్' ఘనతను సాధించాడు. ఈ టెస్టు మ్యాచ్‌లో కుంబ్లే చేసిన మాయాజలంతో భారత జట్టు పాకిస్థాన్‌పై 212 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టెస్టుతోనే కుంబ్లే భారత అత్యుత్తమ టెస్టు బౌలర్లలో ఒకడిగా నిలిచాడు.
కాగా, మ్యాచ్ విశేషాల్లోకి వెళితే చివరి రోజు ఆటలో భాగంగా పాకిస్తాన్‌కు 420 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. చేతిలో పది వికెట్లు ఉన్నాయి. చివరి రోజు క్రీజులో నిలబడితే టెస్టు డ్రాగా అవుతుంది. ఈ టెస్టును పాకిస్థాన్ డ్రా చేసి ఉంటే అప్పటికే తొలి టెస్టులో గెలిచిన ఆ జట్టు సిరిస్‌ను కూడా నెగ్గేది.

కుంబ్లే రూపంలో పాక్ ఆశలు గల్లంతు
అయితే కుంబ్లే రూపంలో వారి ఆశలు గల్లంతయ్యాయి. ఈ మ్యాచ్‌లో కుంబ్లే తన విశ్వరూపం చూపించాడు. నిజం చెప్పాలంటే మాయ చేశాడు. తొలి వికెట్‌కు 101 పరుగులతో పటిష్టంగా ఉన్న పాకిస్తాన్ జట్టును తన మాయాజలంతో తిప్పేశాడు. తొలుత పటిష్టంగా కనిపించిన పాక్ ఆ తర్వాత 128 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

207 పరుగుల వద్ద చివరి వికెట్‌ను కోల్పోయిన పాకిస్థాన్
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పాకిస్థాన్ బౌలర్ వసీం అక్రం కాస్త జట్టుని ఆదుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలో 207 పరుగుల వద్ద పాకిస్థాన్ చివరి వికెట్‌ను కోల్పోయింది. ఆ ఇన్నింగ్స్‌లో 74 పరుగులిచ్చిన కుంబ్లే 10 వికెట్లను సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ 'ఫర్ఫెక్ట్ టెన్' సందర్భంగా కుంబ్లే బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్యూలో తన సహచరులకు ధన్యవాదాలు తెలిపాడు.

టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్
వారి వల్లే ఈ అరుదైన మైలురాయిని ఆనాడు సాధించగలిగానని చెప్పుకొచ్చాడు. టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ కూడా కుంబ్లేనే కావడం విశేషం. కెప్టెన్‌గా, జట్టు సభ్యుడిగా కూడా సేవలందించారు. 18 ఏళ్ల క్రికెట్‌లో కొనసాగిన అనిల్ కుంబ్లే అత్యుత్తమ స్పిన్నర్‌గా పేరొందాడు.

132 టెస్టులాడి మొత్తం 619 వికెట్లు
1990 నుంచి 2008 వరకు భారత జట్టుకు సేవలందించిన కుంబ్లే 132 టెస్టులాడి మొత్తం 619 వికెట్లు తీసుకున్నాడు. ఇక శ్రీలంక క్రికెట్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ 133 టెస్టుల్లో 800 వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉండగా ఆసీస్ బౌలర్ షేన్‌వార్న్ 145 టెస్టుల్లో 708 వికెట్లు తీసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం కుంబ్లే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌లో కొన్నాళ్ల పాటు తన సేవలందించారు. గతేడాది టీమిండియా హెడ్ కోచ్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల టీమిండియా సాధించిన విజయాన్నింటి వెనుక కుంబ్లే పాత్ర ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications