
10 వికెట్లు తీస్తానని అసలు ఊహించలేదు
అయితే, చాలా అరుదైన ఘనత సాధించడం తనకు గర్వంగా ఉందని చెప్పాడు. ‘అభిమానులు ఇలా వార్షికోత్సవాలు కూడా గుర్తుంచుకోవడం, మేం కూడా వేడుకగా జరుపుకోవడం చాలా బాగుంటుంది. అప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చొని 10 వికెట్లు తీస్తానని నేను అసలు ఊహించలేదు. అది అలా జరిగిపోయిందంతే. నాకు రాసి పెట్టి ఉంది. ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా వస్తాయి. ఇదే రికార్డు రేపైనా జరుగొచ్చు లేదా మళ్లీ పదేళ్లు పట్టొచ్చు. ఒకవేళ ఎప్పటికీ ఉండకపోవచ్చు' అని కుంబ్లే వ్యాఖ్యానించారు.

ఫిరోజ్ షా కోట్లా మైదానంలో చరిత్ర సృష్టించిన కుంబ్లే
అది ఫిబ్రవరి 7, 1999వ సంవత్సరం... పాకిస్థాన్‌తో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అనిల్ కుంబ్లే మ్యాజిక్ చేశాడు. 26.3 ఓవర్లు వేసిన అనిల్ కుంబ్లే 74 పరుగులిచ్చి 10 వికెట్లు తీశాడు. తద్వారా టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ అరుదైన ఘనతను సాధించిన రెండో బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇటీవల ఇంగ్లాండ్ సిరిస్‌లో చూపెట్టిన జోరును బంగ్లాదేశ్‌తో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్‌లోనూ కొనసాగిస్తామని అనిల్ కుంబ్లే చెప్పడం విశేషం.

రెండుసార్లు ఆలౌట్ చేసే సత్తా భారత బౌలర్లకుంది
ప్రత్యర్థిని రెండుసార్లు ఆలౌట్ చేసే సత్తా తమ బౌలర్లకు ఉందని కుంబ్లే ధీమా వ్యక్తం చేశాడు. ‘మేం అన్ని జట్లనూ ఒకేలా చూస్తున్నాం. బంగ్లాదేశ్ చాలా మెరుగైన జట్టు. గత నెలలో న్యూజిలాండ్‌పై బాగా రాణించింది. మేం ప్రత్యర్థిని కచ్చితంగా గౌరవిస్తాం. బంగ్లాలో నాణ్యమైన ఆటగాళ్లున్నారు' అని కుంబ్లే చెప్పుకొచ్చాడు. ఇక, స్వదేశంలో టీమిండియా అద్భుతంగా రాణిస్తోందని కుంబ్లే కితాబిచ్చాడు. భారత విజయంలో సిన్నర్లతో పాటు ఫాస్ట్ బౌలర్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారన్నాడు.

మిడిల్ ఆర్డర్: రహానే, నాయర్‌ల మధ్య పోటీ
గత సిరీస్‌లో మురళీ విజయ్, కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడారని అన్నాడు. అయితే అభినవ్ ముకుంద్‌ను బ్యాకప్ ఓపెనర్‌గా మాత్రమే ఎంపిక చేశామన్నాడు. మ్యాచ్ సందర్భంగా ఏదైనా జరిగితే తక్షణమే అతను అందుబాటులోకి వస్తాడు. ముకుంద్‌కు అంతర్జాతీయ అనుభవం ఉంది. అలాగే దేశవాళీలో పరుగుల వరద పారించాడని కుంబ్లే పేర్కొన్నాడు. ఇక, తుది జట్టుపై ముఖ్యంగా మిడిలార్డర్ కూర్పుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కుంబ్లే ఒక ప్రశ్నకు బదులుగా చెప్పాడు.

హార్దిక్ పాండ్యాలో ఆల్ రౌండర్‌గా ఎదిగే లక్షణాలు
ప్రస్తుతం అతను మంచి ఫామ్‌లో ఉన్న ముకుంద్, దేశవాళీ ప్రతిభకు దక్కిన ప్రతిఫలం ఇది. చెన్నైలో ట్రిపుల్ సెంచరీతో తనకు లభించిన అవకాశాన్ని కరుణ్‌నాయర్ సద్వినియోగం చేసుకున్నాడు. కానీ ఆజింక్య రహానె ఎంత విలువైన ఆటగాడో అందరికీ తెలుసు. ఎందుకంటే గతంలో అతను జట్టుకు చాలా ఉపయోగపడ్డాడు. మిడిలార్డర్ కూర్పుపై బుధవారం నిర్ణయం తీసుకుంటామని, 3 ఫార్మాట్లలో నాణ్యమైన ఆల్‌రౌండర్‌గా ఎదిగే లక్షణాలు హార్దిక్ పాండ్యాలో ఉన్నాయని కుంబ్లే అభిప్రాయపడ్డాడు.


Click it and Unblock the Notifications











