హైదరాబాద్: క్రికెట్‌లో ఏ స్థాయిలోనైనా సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది. తాజాగా టీ20 క్రికెట్లో రాజస్థాన్‌కు చెందిన ఓ యువ బౌలర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 15 ఏళ్ల ఆకాశ్ చౌధరీ టీ20ల్లో గతంలో ఎవరికీ సాధ్యం కాని రికార్డుని నెలకొల్పాడు.
జైపూర్ వేదికగా జరిగన ఓ స్ధానిక మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టుకు ఒక్క పరుగు కూడా సమర్పించుకోకుండా టీ20ల్లో ఏకంగా పది వికెట్లు తీశాడు. జైపూర్‌లోని స్ధానిక క్రికెట్ స్టేడియం ఓనర్ వారి తాత భవెర్ సింగ్ జ్ఞాపకార్థం టీ20 టోర్నీని నిర్వహించారు. ఇందులో భాగంగా బుధవారం దిశా క్రికెట్ అకాడమీ, పెరల్ అకాడమీ జట్లు తలపడ్డాయి.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పెరల్ జట్టు... దిశా క్రికెట్ అకాడమీ జట్టుని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో దిశా జట్టు నిర్ణీత ఓవర్లలో 156 పరుగులు చేసింది. అనంతరం 157 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పెరల్ జట్టు పేసర్ ఆకాశ్ చౌధరీ చెలరేగడంతో 36 పరుగులకే ఆలౌటైంది.
మొత్తం నాలుగు ఓవర్లు వేసిన ఆకాశ్.. తన తొలి 3 ఓవర్లలో ఓవర్‌కు రెండు వికెట్లు చొప్పున ఆరు వికెట్లు తీశాడు. ఇక నాలుగో ఓవర్‌లో హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు తీసి టీ20ల్లో 10 వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. దీంతో 120 పరుగుల తేడాతో దిశా అకాడమీ ఘన విజయం సాధించింది.
అంతర్జాతీయ, దేశవాళీ ఏ స్థాయిలోనైనా టీ20ల్లో ఆకాశ్ 4-4-0-10తో రికార్డు నెలకొల్పాడు. 2002లో జన్మించిన ఆకాశ్ రాజస్ధాన్-ఉత్తర్ ప్రదేశ్ బోర్డర్‌లోని భరత్‌పూర్ జిల్లాకు చెందిన వాడు.