ముంబై: బాలీవుడ్ నటి, టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాజీ ప్రియురాలు అనుష్క శర్మపై సామాజిక మాధ్యమాల్లో కొందరు అవమానకర వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ రంగంలోకి దిగారు. అనుష్కపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నవారిపై సోమవారం విరాట్ కోహ్లీ మండిపడిన సంగతి తెలిసిందే.
కాగా, మంగళవారం సునీల్ గవాస్కర్ కోహ్లీకి వత్తాసు పలికారు. అనుష్క 'లవ్లీ గర్ల్' అంటూ ప్రశంసించారు. కోహ్లీ క్రికెటర్‌గా, వ్యక్తిగా ఎదగడంలో ఆమె అతడిపై సానుకూల ప్రభావాన్ని చూపిందన్నారు. సోషల్ మీడియాలో ఆమెపై రకరకాల వ్యాఖ్యలు విసుగు కలిగిస్తున్నాయని అన్నారు.

కోహ్లీ, అనుష్కల మధ్య సంబంధం గురించి తనకు పెద్దగా తెలియదని, అయితే అనుష్క మాత్రం లవ్లీ గర్ల్ అని చెప్పారు. వారిద్దరూ చూడ్డానికి బాగుంటారని అన్నారు. ఆమె కోహ్లీలో సానుకూల దృక్పథానికే కారణమయ్యారని తెలిపారు. తమ జీవితాల్లో ప్రేమ లేని వాళ్లే ఈ జంటపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కోహ్లీకి అనుష్క ఎప్పుడూ మద్దుగానే ఉన్నారని చెప్పారు.
టీ20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అద్భుతంగా ఆడాడని కొనియాడారు. కోహ్లీ అద్భుత ఇన్నింగ్సే భారత్‌ను గెలిపించిందని తెలిపారు.
కాగా, కోహ్లీ ప్రదర్శనపై కొందరు సోషల్ మీడియాలో స్పందిస్తూ... కోహ్లీ అనుష్కకు దూరమైన తర్వాతే అతడి ఆటతీరు మెరుగుపడిందంటూ పలువురు పోస్ట్‌లు చేశారు. ఈ విషయమై కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనుష్కపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటంటూ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు సునీల్ గవాస్కర్ సైతం పైవిధంగా వ్యాఖ్యానించారు.