ఈ ఏడాది ఐపీఎల్‌లో అద్భుతమైన ఫామ్ కనబరిచిన వారిలో శుభ్‌మన్ గిల్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ముఖ్యంగా టోర్నీ చివరి దశలో అతను వరుస శతకాలతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో అతని ఫ్యాన్స్ మాత్రమే కాదు.. గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం కూడా సోషల్ మీడియాలో కొంత అతి చేసింది.
క్రికెట్‌లో 'కింగ్' కోహ్లీ ఉండటంతో గిల్‌ను అందరూ 'ప్రిన్స్' అని పిలిచేవారు. కానీ ఐపీఎల్‌లో అతను రాణించడంతో గిల్ ఇప్పుడు 'కింగ్' అంటూ గుజరాత్ టైటాన్స్ తమ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. అలాంటి గిల్ ఇప్పుడు వెస్టిండీస్ టూర్‌లో ఏమాత్రం రాణించడం లేదు. టెస్టుల్లో, వన్డేల్లో తేలిపోయిన అతను పొట్టి ఫార్మాట్‌లోనూ విఫలం అవుతున్నాడు.

మూడో వన్డేలో మినహా ఒక్క మ్యాచ్‌లో కూడా గిల్ రాణించలేదు. ఐపీఎల్ ముగిసిన తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కూడా గిల్ దారుణంగా ఫెయిలయ్యాడు. ఈ క్రమంలోనే మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా గిల్ ఆటతీరును విమర్శించాడు. 'ప్రస్తుతం సమస్య గిల్ ఫామ్. ఐపీఎల్‌లో చాలా మంది అతను ప్రిన్స్ కాదు.. కింగ్ అంటూ కామెంట్లు చేయడం విన్నా' అని చోప్రా గుర్తుచేశాడు.
'కానీ ఆ తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్‌లో గిల్ రాణించలేదు. విండీస్‌తో రెండు టెస్టులు ఆడాడు. పరుగులు చేయలేదు. ఆ తర్వాత మూడు వన్డేల్లో ఒక్క హాఫ్ సెంచరీ చేశాడు. మరొక మ్యాచ్‌లో 34 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు జరిగిన మూడు టీ20ల్లో సింగిల్ డిజిట్ స్కోర్లే చేశాడు. ఈ విండీస్ టూర్‌లో తను అసలు పరుగులు చేసినట్లే లేదు' అని విమర్శించాడు.
మ్యాచ్ జరిగే పిచ్‌లు కొంచెం స్లోగా ఉన్నా.. అతను రిథమ్ కోల్పోతున్నాడని గిల్ పొరపాటును ఎత్తిచూపాడు. ఫామ్‌లో ఉన్నప్పుడు గిల్ అద్భుతమైన బ్యాటరే. ఐపీఎల్ ముందు కివీస్‌తో జరిగిన సిరీసులో వన్డేల్లో డబుల్ సెంచరీ బాదాడు. ఆ తర్వాత అదే జట్టుపై టీ20ల్లో కూడా సెంచరీతో చెలరేగాడు. కానీ ఐపీఎల్ తర్వాత పూర్తిగా ఫామ్ కోల్పోయాడు.