చర్చలు ఫలించేనా?: త్వరలో భారత్-పాక్‌ల మధ్య ద్వైపాక్షిక సిరిస్!

హైదరాబాద్: బీసీసీఐతో ద్వైపాక్షిక సిరిస్‌లు నిర్వహించే దిశగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కొత్త ఛైర్మన్ ఎహసాన్ మని తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో దుబాయి వేదికగా ఇరు జట్ల మధ్య ఇప్పటికే రెండు మ్యాచ్‌లు జరిగిన సంగతి తెలిసిందే.
ఈ రెండు మ్యాచ్‌లకు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరిస్‌లను పునరుద్ధరించే క్రమంలో ద్వైపాక్షిక సిరీస్‌కు సంబంధించి చర్చలు జరిగినట్లు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో యూఏఈలోనే రెండు దేశాల మధ్య సిరీస్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఈ మేరకు బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారులతో చర్చిస్తున్నారు. ఈ విషయమై సుప్రీంకోర్టు నియమించిన (కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్)సీఓఏతో మాట్లాడిన తర్వాత దీనిపై ఓ ప్రకటన చేయనున్నాడు. ఈ ద్వైపాక్షిక సిరిస్‌కు సీఓఏ అంగీకారం తెలిపితే, వచ్చే బుధవారమే బోర్డు తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది అని ఆ అధికారి వెల్లడించారు.

ఐసీసీ ప్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్(ఎఫ్‌టీపీ)లో భాగంగా
ఐసీసీ ప్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్(ఎఫ్‌టీపీ)లో భాగంగా 2014 నవంబర్ నుంచి డిసెంబర్ 2015 మధ్య కాలంలో రెండు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు పీసీబీతో బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో ఈ ద్వైపాక్షిక సిరిస్‌లు సాధ్యం కాలేదు.

న్యాయపోరాటానికి దిగిన పాకిస్థాన్ బోర్డు
దీంతో తమకు నష్టపరిహారంగా రూ. 447 కోట్లు చెల్లించాలని పాకిస్థాన్ బోర్డు న్యాయపోరాటానికి దిగింది. పాకిస్థాన్‌కు నష్టపరిహారం చెల్లించే కేసును వాదించేందుకు బీసీసీఐ ఇద్దరు విదేశీ లాయర్లను నియమించుకుంది. అక్టోబర్ 1 నుంచి 3 వరకు ఐసీసీ ఈ విచారణ చేపట్టనుంది. దీంతో దుబాయ్‌కు చెందిన లా ఫర్మ్ హెర్బర్ట్ స్మిత్ ఫ్రీహిల్స్‌తో పాటు ఓ బ్రిటిష్ లాయర్ క్యూసీ ఇయాన్ మిల్స్ ఈ కేసులో బీసీసీఐ తరఫున వాదనలు వినిపించనున్నారు.

బ్రిటిష్ నిబంధనలను పాటించడంతో
ఐసీసీ ఎక్కువగా బ్రిటిష్ నిబంధనలను పాటించడంతో మిల్స్‌ను రంగంలోకి దించారు. తమతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడనందుకు నష్టపరిహారం కింద రూ. 447 కోట్లు చెల్లించాలని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఐసీసీలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆసియా కప్ సందర్భంగా బీసీసీఐ అధికారులతో చర్చలు జరుగుతున్నాయని, అవి సానుకూలంగా ఉన్నాయని పీసీబీ ఛైర్మన్ ఎహసాన్ మని చెప్పారు.

చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోన్న ఈ ఆలోచన
అయితే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బ తిన్న పరిస్థితుల్లో పాక్‌తో సిరీస్ దిశగా ఆలోచన చేయడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పాక్ కొత్త ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అభ్యర్థన మేరకు న్యూయార్క్‌లో రెండు దేశాల విదేశాంగ మంత్రుల భేటీకి భారత్ అంగీకరించినప్పటికీ, ముగ్గురు పోలీసులు, ఒక బీఎస్‌ఎఫ్ జవాన్‌ను పాక్ ఉగ్రవాదులు, రేంజర్లు హత్యచేయడంతో ఈ భేటీని రద్దు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications