పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై ఆ దేశ మాజీ క్రికెటర్ రషీద్ లతిఫ్ తీవ్ర విమర్శలు చేశాడు. పాక్ జాతీయ జట్టును సమర్థవంతంగా నడిపించడంలో పీసీబీ దారుణంగా విఫలమవుతుందని మండిపడ్డాడు. ఐసీసీ ఈవెంట్లలో పాక్ పేలవ ప్రదర్శనకు కెప్టెన్, కోచ్‌లు కారణం అంటూ బోర్డు నిందలు మోపి తప్పించుకుంటుందని అన్నాడు. మరో నెల రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న సమయంలో పాకిస్థాన్‌కు కొత్త కోచ్‌ను నియమించడంపై లతిఫ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఇటీవల పీసీబీ కొత్త కోచ్‌లను నియమించిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ టీమ్ వైట్ బాల్ క్రికెట్‌కు గ్యారీ కిర్‌స్టన్, టెస్టులకు జేసన్ గిల్లెస్పీలను ప్రధాన కోచ్‌లుగా నియమించింది. ''టీమిండియా తరఫున, ఫ్రాంచైజీ క్రికెట్‌లో కిర్‌స్టన్ విజయవంతమైన కోచ్‌గా సత్తాచాటాడు. ఇప్పుడు అతన్ని పాక్ టీమ్ కోచ్‌గా పీసీబీ నియమించింది. అయితే అతని ఎంపిక బాగానే ఉంది, కానీ టైమింగే కరెక్ట్‌గా లేదు. పాకిస్థాన్‌లో ఎప్పుడూ ఇదే సమస్య ఉంటుంది''

''మరో నెలలో టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొననున్నాం. దీనికి సన్నాహకంగా మరో ఏడు మ్యాచ్‌లు ఆడనున్నాం. సమయం చాలా తక్కువగా ఉంది. ఒకవేళ మెగాటోర్నీలో ఓటమిపాలైతే పాక్ బోర్డు.. కెప్టెన్ బాబర్ అజామ్, కోచ్ గ్యారీ కిర్‌స్టన్‌లను నిందిస్తుంది. ఇది పాకిస్థాన్‌లో సంప్రదాయం. బాబర్, గ్యారీ గురించి నేను తప్పుగా మాట్లాడట్లేదు''
''అయితే ఐసీసీ ఈవెంట్లలో పాకిస్థాన్‌ను తక్కువగా అంచనా వేయకూడదు. పాక్ పనైపోయిందని భావించకూడదు. అట్టడుగున నుంచి దూసుకెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరోవైపు కోచ్‌లుగా కిర్‌స్టన్, గిల్లెస్పీకి మంచి రికార్డులు ఉన్నాయి. కానీ వారిద్దరిని కాస్త ముందుగా నియమించాల్సింది. ఇవాళ ప్రధాన కోచ్ ఎవరు? కెప్టెన్ ఎవరు? సెలక్షన్ కమిటీ ఎవరు? అని పాకిస్థాన్‌లో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లో అలా ఉండదు. 6-8 నెలల ముందే 12-13 ఆటగాళ్లు, కోచ్ ఎంపిక ఖరారై ఉంటుంది'' అని రషీద్ లతిఫ్ పేర్కొన్నాడు.