నోరు జారి బుక్కైన పాక్ ఆల్ రౌండర్.. పీసీబీ స్ట్రాంగ్ వార్నింగ్!
2026 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి భారత్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమి పాలవ్వడం ఆ దేశంలో పెద్ద దుమారాన్నే రేపింది. ఈ పరాజయాన్ని జీర్ణించుకోలేని షాహిద్ అఫ్రిది, మహమ్మద్ యూసుఫ్ వంటి మాజీ ఆటగాళ్లు ప్రస్తుత జట్టు ప్రదర్శనపై, ముఖ్యంగా ఆల్ రౌండర్ షదాబ్ ఖాన్ ఫామ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలు కాస్తా వ్యక్తిగత స్థాయికి వెళ్లడంతో మైదానంలో నిరూపించుకోవాల్సిన ఆటగాళ్లు ఇప్పుడు మీడియా వేదికగా మాజీలతో వాగ్వాదానికి దిగుతున్నారు.
షదాబ్ ఖాన్ వివాదాస్పద కామెంట్స్
నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో (36 పరుగులు, 3 వికెట్లు) ఆకట్టుకున్న షదాబ్ ఖాన్, మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తన అసహనాన్ని ప్రదర్శించారు. మాజీ ఆటగాళ్లు తమను విమర్శించేటప్పుడు వాస్తవాలను మరచిపోతున్నారని ఆయన మండిపడ్డారు. "మాజీలు లెజెండ్స్ కావచ్చు, కానీ గతంలో ఏ పాక్ జట్టు చేయలేని పనిని మేము చేశాం. ప్రపంచకప్ చరిత్రలో భారత్‌ను ఓడించిన రికార్డు మాకుంది (2021 టీ20 వరల్డ్ కప్ ప్రస్తావిస్తూ). ఆ ఘనత సాధించని వారు కూడా మమ్మల్ని విమర్శించడం సరికాదు" అంటూ షదాబ్ ఖాన్ చేసిన కామెంట్స్ పాక్ క్రికెట్ వర్గాల్లో కలకలం రేపాయి.

స్పందించిన పీసీబీ
షదాబ్ ఖాన్ కామెంట్స్ క్రమశిక్షణారాహిత్యంగా భావించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) వెంటనే రంగంలోకి దిగింది. జట్టు మేనేజర్ నవీద్ చీమా ద్వారా షదాబ్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. మాజీ ఆటగాళ్లు దేశ కీర్తిని పెంచిన వారనే విషయాన్ని మరచిపోకూడదని.. గౌరవప్రదమైన భాషను వాడాలని బోర్డు ఆదేశించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, షదాబ్ ఖాన్ మామ, దిగ్గజ స్పిన్నర్ సక్లైన్ ముస్తాక్ కూడా తన అల్లుడి వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. తాము ఐసీసీ ట్రోఫీలు గెలవకపోయినా.. ఎన్నో చారిత్రాత్మక విజయాల్లో భాగస్వాములమయ్యామని, మాజీలను తక్కువ చేయడం తగదని ఆయన హితవు పలికారు.
ఆటగాళ్లపై కఠిన ఆంక్షలు:
ఈ వివాదం ముదిరి జట్టులో అసహనం పెరగకుండా ఉండేందుకు పీసీబీ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇకపై ఆటగాళ్లు విలేకరుల సమావేశంలో కేవలం ప్రస్తుత మ్యాచ్, వ్యూహాల గురించి మాత్రమే మాట్లాడాలని, వ్యక్తిగత విమర్శలకు లేదా మాజీల వ్యాఖ్యలకు బదులివ్వకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలను అతిక్రమిస్తే వారిపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ముందున్న సవాలు:
నమీబియాపై గెలుపుతో పాకిస్థాన్ ప్రస్తుతం సూపర్-8 దశకు చేరుకుంది. అయితే ఈ వివాదాల ప్రభావం రాబోయే మ్యాచ్‌లపై పడకూడదని బోర్డు భావిస్తోంది. శనివారం న్యూజిలాండ్‌తో జరగబోయే కీలక పోరుతో పాక్ తన సూపర్-8 ప్రయాణాన్ని ప్రారంభించనుంది. అనంతరం ఇంగ్లాండ్, శ్రీలంక వంటి బలమైన జట్లతో తలపడాల్సి ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications