హైదరాబాద్: పాకిస్థాన్ జాతీయ జట్టులో ఆడిన క్రికెటర్ ఖలిద్ లతీఫ్‌పై జీవితకాల నిషేధం విధించాలని ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) డిమాండ్ చేస్తోంది. స్ఫాట్ ఫిక్సింగ్ కేసులో దొరికిన ఖలిద్ లతీఫ్ ఇప్పటికే ఐదేళ్ల పాటు నిషేధానికి గురైన సంగతి తెలిసిందే.
తాజాగా ఖలిద్ లతీఫ్‌ను కఠినంగా శిక్షించాలని స్వతంత్ర న్యాయమూర్తికి దరఖాస్తు చేసినట్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) లీగల్ అడ్వైజర్ తఫజుల్ రిజ్వీ బుధవారం తెలిపారు. పీసీబీ నిర్వహించిన స్ధానిక క్రికెట్ టోర్నీ సందర్భంగా పాక్ క్రికెటర్లు షర్జీల్ ఖాన్, ఖలిద్ లతీఫ్ స్ఫాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు.
ముగ్గురు సభ్యులతో కూడిన యాంటీ-కరప్షన్ ట్రైబ్యునల్ వీరిని దోషులుగా తేల్చింది. ఈ విచారణలో వారిద్దరూ బుకీలను కలిశారని కూడా ట్రైబ్యునల్ వెల్లడించింది. దీంతో షర్జీల్‌పై ఐదేళ్ల నిషేధం విధించగా.... లతీఫ్‌కు మాత్రం ఐదేళ్ల నిషేధంతో పాటు రూ.10 లక్షల జరిమానా విధించింది.

అయితే ఈ తీర్పు పట్ల సంతృప్తిగా లేని పీసీబీ ఖలిద్ లతీఫ్‌పై జీవిత కాల నిషేధం విధించాలని డిమాండ్ చేస్తోంది. అతడు ఫిక్సింగ్ చేయడంతో పాటు జట్టులోని మిగతా సభ్యులను కూడా ఫిక్సింగ్ చేయాలని ఒత్తిడి చేశాడని పీసీబీ ఈ సందర్భంగా వెల్లడించింది.
ఈ నేపథ్యంలో లతీఫ్‌కు విధించిన శిక్ష సరిపోదని అతడికి జీవిత కాలం నిషేధం సరైందని పీసీబీ పేర్కొంది. పాకిస్థాన్ క్రికెట్‌లో అవినీతి, అక్రమాలను అస్సలు సహించేది లేదని బోర్డు తేల్చి చెప్పింది. గతంలో మాజీ క్రికెటర్ సలీమ్ మాలిక్‌పై మాత్రమే ఆ దేశ బోర్డు జీవితకాల నిషేధం విధించింది.