మళ్లీ గదే ముచ్చట! పాక్ టీం లొల్లి మాములుగా లేదుగా!
బంగ్లాదేశ్ జట్టుతో ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్‌లో 0-2తో ఘోర పరాజయం పాలైన తర్వాత పాకిస్థాన్ క్రికెట్‌లో తీవ్ర ప్రకంపనలు రేగుతున్నాయి. ఖచ్చితంగా గెలుస్తుందనుకున్న సిరీస్‌లో క్లీన్ స్వీప్ అవ్వడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఇప్పుడు జట్టులో భారీ శస్త్రచికిత్సకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం టెస్ట్ కెప్టెన్ షాన్ మసూద్, హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ ఇద్దరి పదవులకూ ఎసరు వచ్చేలా కనిపిస్తోంది. పీసీబీ కేవలం ఆటగాళ్ల ఆటతీరును మాత్రమే కాకుండా జట్టులోని మొత్త నాయకత్వ వ్యవస్థను మార్చాలని యోచిస్తోంది.
టెస్ట్ జట్టులో సమూల మార్పులు
ఈ అవమానకర ఓటమిపై పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని.. టెస్ట్ జట్టులో సమూల మార్పులు చేయాలని కోరుకుంటున్నారని పీటీఐ నివేదిక పేర్కొంది. ఇందులో భాగంగానే బోర్టు మాజీ కెప్టెన్లు యూనిస్ ఖాన్, మహ్మద్ హఫీజ్‌లను సంప్రదించింది. జాతీయ జట్టులో కీలక బాధ్యతలు చేపట్టే విషయమై వీరిద్దరితో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఉన్నతాధికారులు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

టెస్ట్ కోచ్‌గా యూనిస్ ఖాన్
బంగ్లాదేశ్ పర్యటనకు ముందే టెస్ట్ జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన సర్ఫరాజ్ అహ్మద్‌ను ఆ పదవి నుంచి తప్పించాలని బోర్డులో ప్రతిపాదనలు వచ్చాయి. ఆయనను తిరిగి అండర్-19 లేదా పాకిస్థాన్ ఎ జట్టు బాధ్యతలకు పరిమితం చేయాలని చూస్తున్నారు. సర్ఫరాజ్ స్థానంలో పాకిస్థాన్ అత్యంత విజయవంతమైన టెస్ట్ బ్యాటర్ యూనిస్ ఖాన్‌ను తదుపరి టెస్ట్ కోచ్‌గా నియమించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే యూనిస్ ఖాన్ బోర్డు ముందు కొన్ని స్పష్టమైన షరతులు ఉంచారని.. వాటిపై ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.
అయోమయంలో కెప్టెన్ షాన్ మసూద్
మరోవైపు కెప్టెన్ షాన్ మసూద్ భవిష్యత్తు కూడా అయోమయంలో పడింది. బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన ఘోర పరాజయం తర్వాత ఆయన కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాబోయే వెస్టిండీస్ ఇంగ్లాండ్ సిరీస్‌ల వరకు తనకు మరో అవకాశం ఇవ్వాలని షాన్ మసూద్ బోర్డును కోరినట్లు తెలుస్తోంది. కానీ బోర్డు సభ్యులు మాత్రం వెంటనే నాయకత్వాన్ని మార్చాలనే పట్టుదలతో ఉన్నారు.
ఇక మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్‌కు చీఫ్ సెలెక్టర్, ఇంటర్నేషనల్ క్రికెట్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా కీలక బాధ్యతలు అప్పగించాలని బోర్డు యోచిస్తోంది. అయితే పీసీబీలోని కొందరు అధికారులు ఈ నిర్ణయంపై పూర్తి సంతృప్తితో లేరు. గత కొన్ని నెలలుగా బోర్డు విధానాలపై, జట్టు తీరుపై హఫీజ్ బహిరంగంగానే విమర్శలు గుప్పించడమే ఇందుకు కారణం. ఆయనను బోర్డులోకి తీసుకుంటే కొత్త వివాదాలు రేగుతాయేమోనని కొందరు ఆందోళన చెందుతున్నారు.
ఈ పరిణామాల మధ్యే రాబోయే అంతర్జాతీయ, దేశవాళీ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని నేషనల్ క్రికెట్ అకాడమీలో 49 మంది ఆటగాళ్లతో కూడిన రెడ్-బాల్ మరియు వైట్-బాల్ క్యాంప్‌ను పీసీబీ ప్రకటించింది. ఈ క్యాంప్‌లో ఆటగాళ్ల ఫిట్‌నెస్, సాంకేతిక నైపుణ్యాలు, మానసిక దృఢత్వంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. కోచ్‌లు, మెడికల్ స్టాఫ్‌తో వ్యక్తిగత సెషన్లు కూడా నిర్వహించి ఆటగాళ్లను తిరిగి గాడిలో పెట్టాలని బోర్డు భావిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications