హైదరాబాద్: ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ పరిస్థితుల భారత్-పాక్‌ల మధ్య ఇప్పట్లో ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగే అవకాశం లేదు. దీంతో గతంలో చేసుకున్న ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ ఒప్పందాన్ని విస్మరించిన బీసీసీఐపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించింది.
ఇందులో భాగంగా తమతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడనందుకు నష్టపరిహారం కింద దాదాపు రూ. 450 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు బీసీసీఐపై ఫిర్యాదు చేస్తూ ఐసీసీకి నోటీసులు పంపించింది. 'ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడించండి లేదా మాకు బీసీసీఐ నుంచి రూ. 452 కోట్ల నష్టపరిహారాన్ని ఇప్పించండి' అని పీసీబీ ఐసీసీని కోరింది.
పీసీబీ నోటీసు తమకు అందిందని ఐసీసీ కూడా ధ్రువీకరించింది. 'పీసీబీ న్యాయవాది నుంచి ఐసీసీకి నోటీస్ అందింది. ఆ నోటీస్‌ను వివాద పరిష్కార కమిటీ చైర్మన్‌కు వచ్చే వారం పంపిస్తాం' అని ఐసీసీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం ఐసీసీ వివాదాపరిష్కార కమిటీకి చైర్మన్‌గా మైకేల్ బెలాఫ్ వ్యవహరిస్తున్నారు.
గతంలో ఇరు దేశాలు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేలా ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం టీమిండియా 2014 నవంబర్, 2015 డిసెంబర్లలో సిరిస్ ఆడేలా ఒప్పందం చేసుకుంది. దీంతోపాటుగా 2015 డిసెంబర్ నుంచి 2022 డిసెంబర్ వరకు ఆరు సిరీస్‌లు ఆడాలని ఒప్పందం చేసుకున్నాయి.
ఆ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారడంతో పాక్‌తో క్రికెట్ ఆడేందుకు కేంద్ర అంగీకరించలేదు. అయితే బీసీసీఐ తీరు కారణంగానే సిరీస్‌లు రద్దయ్యాయని పీసీబీ వాదిస్తోంది. దీని కారణంగా తాము 70 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.452కోట్లు) నష్టపోయామంటూ ఐసీసీకి చేసిన ఫిర్యాదులో పేర్కొంది.
2018 క్యాలెండర్‌ను నిర్ణయించేందుకు డిసెంబర్ 7న ఐసీసీ సమావేశం కానున్న నేపథ్యంలో బీసీసీఐ తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని గౌరవిస్తేనే ఈ క్యాలెండర్ మార్పులపై సంతకం చేస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హెచ్చరించడం విశేషం. ఇందులో భాగంగా 2014 ఏప్రిల్‌లో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పీసీబీ ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చింది.
ద్వైపాక్షిక సిరిస్ ఒప్పందానికి సంబంధించి ఈ ఏడాది ఆరంభంలో పీసీబీ... బీసీసీఐకి లీగల్ నోటీస్ పంపినప్పటికీ, బోర్డు అధికారులు దానిని తిరస్కరించిన సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.