పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్‌ను జట్టు నుంచి తప్పించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాబర్‌ను తప్పిస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీసుకున్న నిర్ణయంపై పాక్ మాజీ క్రికెటర్లు, విదేశీ మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో పాక్ క్రికెటర్ ఫకర్ జమాన్ చేసిన పోస్ట్‌పై పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చేసిన పోస్ట్ గురించి వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.
అసలేం జరిగిందంటే.. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 556 పరుగులు సాధించి కూడా ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమి అనంతరం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రక్షాళన చేపట్టింది. ఇంగ్లండ్‌తో జరగనున్న రెండు, మూడు టెస్టులకు మాజీ కెప్టెన్ బాబర్ అజామ్‌తో పాటు స్టార్ క్రికెటర్లు షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షాలను జట్టు నుంచి తప్పించింది. అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు అవకాశం ఇస్తూ షాన్ మసూద్ సారథ్యంలో 16 మందితో కూడిన జట్టును పాక్ బోర్డు ప్రకటించింది.

అయితే పీసీబీ జట్టు ప్రకటించే కొద్ది క్షణాల ముందు ఫకర్ జమాన్ ట్వీట్ చేశాడు. ''బాబర్ అజామ్‌ను తొలగించాలన్న సూచనలు వినడం ఆందోళన కలిగిస్తోంది. 2020 నుంచి 2023 మధ్య కాలంలో విరాట్ కోహ్లి 19.33, 28.21, 26.50 సగటుతో ఉన్నప్పటికీ , అతనని భారత్ బెంచ్‌కు పరిమితం చేయలేదు. మన ప్రీమియర్ బ్యాటర్ బాబర్ అజామ్‌ను తొలగించాలని నిర్ణయం తీసుకుంటే.. అది జట్టులో ప్రతికూల సందేశాన్ని పంపుతుంది''
''ఈ భయాందోళనలు అడ్డుకోవడానికి మనకు ఇంకా సమయం ఉంది. మన ప్రధాన ఆటగాళ్లను అణగదొక్కడం కంటే, వారిని కాపాడుకోవడంపై దృష్టిసారించాలి'' అని ఫకర్ జమాన్ ట్వీట్ చేశాడు. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సీరియస్ అయ్యింది. వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు బాబర్ అజామ్‌కు విశ్రాంతి ఇచ్చామని, జట్టు నుంచి తొలగించలేదని పాకిస్థాన్ కోచ్ గిలెస్పీ పేర్కొన్నాడు. అయితే పాకిస్థాన్ క్రికెట్ సెలక్షన్ కమిటీలో సభ్యుడు ఆకీబ్ జావేద్.. విశ్రాంతి ఇచ్చామని పేర్కొంటూ ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్, ఫిట్‌నెస్‌ను దృష్టిలో పెట్టుకుని కూడా జట్టును ఎంపిక చేసినట్లు చెప్పడం గమనార్హం.
కాగా, 2022 డిసెంబర్ తర్వాత నుండి బాబార్ అజామ్ టెస్టుల్లో కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ముల్తాన్ వేదికగా జరిగిన ఫ్లాట్ పిచ్‌పై కూడా రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 35 పరుగులే చేశాడు. 2022 నుంచి 10 టెస్టులు ఆడిన బాబర్ 27.73 సగటుతో 527 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా 55 టెస్టుల్లో 43.92 సగటుతో 3997 పరుగులు చేశాడు. బాబర్ అజామ్ ఇటీవల పరిమిత ఓవర్ల ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.