పాకిస్థాన్ ఆల్‌రౌండర్ అమీర్ జమాల్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గట్టి షాకిచ్చింది. నిబంధనలను ఉల్లఘించినందుకు గాను అతడికి భారీ జరిమానా విధించింది. అతడితో పాటు పలువురు పాక్ క్రికెటర్లపై కూడా జరిమానా విధించింది పీసీబీ. ఇంతకీ ఆ క్రికెటర్లు ఏం చేశారంటే?
సంఘీభావం తెలపాలనే ఉద్దేశ్యంతో..
జమాల్ స్వదేశంలో ఆడిన ఓ టెస్టు మ్యాచ్ లో తన క్యాప్‌పై 804 నెంబర్ ను రాసుకుని కనిపించాడు. జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బ్యాడ్జ్ నెంబర్ కూడా 804. ఇమ్రాన్ కు సంఘీభావం తెలపాలనే ఉద్దేశ్యంతోనే జమాల్ తన టెస్ట్ క్యాప్ పై ఈ నెంబర్ రాసుకున్నట్లు తెలిసింది.

విచారణ జరిపించి..
దీన్ని గుర్తించిన పీసీబీ జమాల్ పై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటున్నట్లు కథనాలు వస్తున్నాయి. 1.4 మిలియన్ల (భారత కరెన్సీలో సుమారు రూ.14 లక్షలు) భారీ జరిమానాను పీసీబీ విధించిందట. అలానే జమాల్ తో పాటు క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరించిన పలువురు క్రికెటర్లపై కూడా కొరడ ఝళపించింది పీసీబీ.
ఆ ప్లేయర్స్ పై కూడా..
జరిమానా పడిన ప్లేయర్స్ లో జమాల్‌తో పాటు సైమ్ అయూబ్, సల్మాన్ అఘా, సుఫీయాన్ ముఖీమ్, అబ్దుల్లా షఫీక్, అబ్బాస్ అఫ్రిది, ఉస్మాన్ ఖాన్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, పాకిస్థాన్ క్రికెట్ లో యాక్టివ్ గా ఉన్న క్రికెటర్లు, కోచింగ్ స్టాఫ్.. రాజకీయాల గురించి మాట్లాడకూడదని బోర్డు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.