
హైదరాబాద్: శ్రీలంక క్రికెట్ చీఫ్ షమ్మీ సిల్వ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అసహనం వ్యక్తం చేసింది. 2009లో శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి జరిగిన తర్వాత ఆ జట్టు పాకిస్థాన్‌లో ఇటీవలే తొలిసారి పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక జట్టు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడింది.
కరాచీ వేదికగా జరిగిన మూడు వన్డేల సిరిస్‌ను 2-0తో ఆతిథ్య జట్టు కైవసం చేసుకోగా... మూడు టీ20ల సిరిస్‌ను మాత్రం శ్రీలంక క్లీన్ స్వీప్ చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా శ్రీలంక సీనియర్ ఆటగాళ్లు ఈ పర్యటనకు వెళ్లలేమని తేల్చి చెప్పడంతో లంక బోర్డు ద్వితీయ శ్రేణి జట్టుని పాక్ పర్యటనకు పంపింది.
పాక్ పర్యటనను ముగించుకుని కొలంబోకు చేరుకున్న తర్వాత భద్రత విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నామని శ్రీలంక బోర్డు అధ్యక్షుడు షమ్మి సిల్వ అసహనం వ్యక్తం చేశాడు. పాక్ పర్యటనలో తాము ఎక్కడికీ వెళ్లలేక హోటల్ గదులకే పరిమితమయ్యామని షమ్మి పేర్కొన్నాడు. అలా మూడు, నాలుగు రోజులు ఇబ్బంది పడ్డానని అన్నాడు.
పరిమిత ఓవర్ల మ్యాచులకే ఇంత ఇబ్బంది పడ్డామని... ఈ ఏడాది డిసెంబర్‌లో శ్రీలంక జట్టు మళ్లీ టెస్టు సిరీస్ ఆడేందుకు గాను పాక్ పర్యటనకు వెళ్లాల్సి ఉండడంతో ఈ విషయంపై ఆటగాళ్లతో చర్చిస్తామని షమ్మి సిల్వ పేర్కొన్నాడు. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ డిసెంబర్‌లో శ్రీలంక జట్టు పాక్‌లో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడాల్సి ఉంది.
అంతేకాదు పాకిస్థాన్ సూపర్ లీగ్(పీసీఎల్) ఐదో సీజన్‌ను ఈసారి పాక్‌లోనే నిర్వహించేందుకు కూడా సన్నాహాలు చేస్తోంది. మరోవైపు త్వరలో బంగ్లాదేశ్ జట్టు టెస్టు సిరిస్ కోసం పాక్‌లో పర్యటించనుంది. ఇలాంటి సమయంలో శ్రీలంక ఛీఫ్ షమ్మి సిల్వ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అసహనం వ్యక్తం చేసింది.
బోర్డు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ "ఆతిథ్య జట్టుకు మా బోర్డు పట్టు బట్టి మరీ అధ్యక్ష స్థాయి భద్రత కల్పించేలా చేసింది. అయినా సరే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా నిరాశకు గురైంది. మేము వారి బసను వీలైనంత సౌకర్యవంతంగా చేయాలనుకుంటున్నాం" అని అన్నారు.
శ్రీలంక బోర్డు ఉన్నతాధికారులను అధికారిక విందులు, ఫంక్షన్లలో పాల్గొనడంతో పాటు వినోదం కోసం శ్రీలంక ఆటగాళ్లకు గోల్ఫ్ ఆడటానికి, షాపింగ్ చేసేందుకు అవకాశాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కల్పించిందని ఆయన తెలిపారు.