హైదరాబాద్: పాకిస్థాన్‌కు చెందిన మరో క్రికెటర్ స్పాట్ ఫిక్సింగ్‌లో దొరికిపోయాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) లో స్పాట్‌ఫిక్సింగ్‌కు పాల్పడిన ఓపెనర్ షర్జీల్ ఖాన్‌పై పాకిస్తాన్ అవినీతి నిరోధక ట్రిబ్యునల్ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది.
మంగళవారం పీసీబీ గత ఫిబ్రవరిలో దుబాయిలో నిర్వహించిన పీఎస్ఎల్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఆధారాలు సమర్పించడంతో ట్రిబ్యునల్ తుది తీర్పును వెలువరించింది. ఈ కేసు విచారణ తర్వాత నిషేధం విధించాలని నిర్ణయించినట్లు ట్రిబ్యునల్ హెడ్ ఆస్ఘత్ హైదర్ వెల్లడించారు.

ఇదే కేసుకు సంబంధించి త్వరలోనే ఖాలిద్ లతీఫ్ భవితవ్యాన్ని కూడా ఈ ట్రిబ్యునల్ తేల్చనుంది. దుబాయిలో జరిగిన పీఎస్ఎల్‌లో షర్జీల్ ఖాన్, ఖాలిద్‌లు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పతున్నారనే ఆరోపణలతో పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభమైన రెండో రోజునే లీగ్ నుంచి వెనక్కి పంపించారు.
షర్జీల్ ఖాన్, అతడి లాయర్ ట్రిబ్యునల్ తీర్పును గౌరవించగా ఖాలిద్ మాత్రం ఈ ట్రిబ్యునల్‌కు ఉన్న రాజ్యాంగబద్ధతను ప్రశ్నించాడు. అయితే స్పాట్ ఫిక్సింగ్‌లో దొరికిపోయి నిషేధాలు ఎదుర్కోవడం పాక్ క్రికెటర్లకు ఇది కొత్తేమీ కాదు. గతంలో పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్, పేసర్ అమీర్, ఆసిఫ్‌లు 2010లో ఇంగ్లండ్ పర్యటనలో స్పాట్ ఫిక్సింగ్‌లో అడ్డంగా దొరికిపోయారు.
దీంతో సల్మాన్ బట్‌తో పాటు పేస్ బౌలర్లు ఆమిర్, ఆసిఫ్‌లపై అప్పట్లో ఐదేళ్ల పాటు నిషేధం విధించారు. 2012లో లెగ్ స్పిన్నర్ కనేరియా సైతం ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. మరీ ముఖ్యంగా పీఎస్ఎల్ ప్రారంభమైన తర్వాత పాకిస్థాన్‌లో ఈ స్పాట్ ఫిక్సింగ్ భూతం మరింతగా విస్తరించింది.
సరిగ్గా మూడు నెలల క్రితం స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఆల్‌రౌండర్ మహ్మద్ నవాజ్‌పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) రెండు నెలల క్రితం వేటు వేసిన సంగతి తెలిసిందే.