కరాచి: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చేసిన హెచ్చరికలతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఓ మెట్టు దిగొచ్చినట్టే కనిపిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించాల్సిన ఆసియా కప్ టీ20 టోర్నీ ఆతిథ్య హక్కులను వదులుకునేందుకు పీసీబీ సిద్ధమైనట్లు సమాచారం తెలుస్తోంది. పాక్‌లో ఆడేందుకు భారత జట్టు విముఖత వ్యక్తం చేయడంతోనే పీసీబీ ఈ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. భారత జట్టు పాల్గొనడానికి సిద్ధంగా లేని క్రమంలో హక్కులను వదిలేసుకోవడానికి వెనుకాడబోమని పీసీబీ చైర్మన్ ఎహ్సన్ మణి తెలిపారు.
పీసీబీ సంచలన నిర్ణయం.. స్టార్ క్రికెటర్‌పై సస్పెన్షన్ వేటు!!
తాజాగా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ట్రోఫీ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఎహ్సన్ మణి మాట్లాడుతూ... 'ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సభ్యత్వ దేశాల ఆదాయాలకు ఆటంకం కలగకుండా చూడాలి. ఇది అందరి సభ్యులను ఉద్దేశించి చెప్పట్లేదు, కొన్ని దేశాల గురించే చెబుతున్నా. అందరి మేలు కోసం అవసరమైతే ఆసియా కప్ హక్కులను వదులకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం' అని అన్నారు.
పాక్ ఆసియా కప్‌కు ఆతిథ్యమిస్తే.. భారత జట్టును అక్కడికి పంపించబోమని బీసీసీఐ గతంలోనే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 'ఆసియా కప్‌ను పాక్ నిర్వహించడం వల్ల తమకెలాంటి అభ్యంతరం లేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం అక్కడ నిర్వహించడాన్నే వ్యతిరేకిస్తున్నాం. టీమిండియాను పాకిస్థాన్‌కు పంపే ప్రసక్తే లేదు. తటస్థ వేదికపై మ్యాచులు నిర్వహించాలని కోరుతున్నాం. ఒకవేళ టీమిండియా లేకుండా ఆసియా కప్‌ను నిర్వహించాలని ఏసీసీ భావిస్తే.. అది ఆసియా కప్ కాకుండా మరో టోర్నీ అవుతుంది' అని బీసీసీఐ అధికారులు గతంలో అన్నారు.
పాక్‌లో టీమిండియా ఆడకుంటే 2021లో భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరిస్తామని ఇటీవలే పీసీబీ బెదిరింపులకు దిగింది. భారత్ దీనిని పట్టించుకోకపోవడంతో పాక్ వెనక్కుతగ్గింది. ఆతిథ్య హక్కులను పాకిస్థాన్ వదులుకునేందుకు సిద్ధమైంది. మార్చి నెలలో జరుగనున్న ఏసీసీ సమావేశంలో వేదికలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆసియా కప్‌పై పాకిస్తాన్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ టోర్నీలో భారత్ పాల్గొంటేనే విజయవంతం అవుతుందని పీసీబీ భావించింది. అయితే భారత్ మద్దతు లేకండా ఈ టోర్నీ విజయవంతం కాదని పీసీబీ సీఈఓ వసీం ఖాన్ గతంలోనే చెప్పారు.