
కరాచీ: ప్రపంచకప్ మ్యాచ్‌లను ప్రమోట్ చేయడానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రత్యేకంగా రూపొందించిన ఒకట్రెండు వాణిజ్య ప్రకటనలు వివాదానికి దారి తీస్తున్నాయి. ప్రత్యేకించి- భారత్- పాకిస్తాన్ జట్ల మధ్య పోలికలను తీసుకొస్తూ రూపొందించిన యాడ్‌పై తీరిగ్గా నిప్పులు చెరుగుతోంది పాకిస్తాన్. ఈ యాడ్ తమ జట్టును అవమాన పరిచేదిగా ఉందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఎహసాన్ మణి విమర్శించారు. భారత క్రికెట్ జట్టును హైలైట్ చేయడానికే దీన్ని తీసినట్టుగా ఉందని వ్యాఖ్యానించారు.
మీరు పనిచేస్తోంది భారత్ కోసం కాదు..
శుక్రవారం కరాచీలోని గడాఫీ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐసీసీ అన్ని దేశాల జట్లకు ప్రాతినిథ్యం వహిస్తోందన్న విషయాన్ని విస్మరించకూడదని హితవు పలికారు. స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం ఐసీసీ ప్రతినిధిగా వ్యవహరించాలే తప్ప ఏ ఒక్క దేశానికో ప్రాతనిథ్యం వహించేలా ఉండకూడదని ఆయన అన్నారు. స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం భారత్, ఆ దేశ క్రికెట్ జట్టును వెనకేసుకొస్తోందని చెప్పారు.
మ్యాచ్‌కు రెండురోజుల ముందు ప్రసారం అయ్యేలా స్టార్ స్పోర్ట్స్ కొన్ని యాడ్లను రూపొందించిన విషయం తెలిసిందే. క్రికెట్ ఆడే అన్ని దేశాల జట్లనూ ఇందులో భాగస్వామ్యులను చేసింది. మ్యాచ్‌లో తలపడబోయే రెండు జట్ల బలాబలాలు, గత చరిత్రను ఆధారంగా తీసుకుని యాడ్స్‌కు రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా.. భారత్-పాక్ మధ్య కూడా ఓ యాడ్‌ను రూపొందించింది. ఆదివారం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఉన్న నేపథ్యంలో.. టీజర్‌గా దీన్ని టెలికాస్ట్ చేస్తోంది.
పాకిస్తాన్ జెర్సీ ధరించిన ఓ వ్యక్తి దినపత్రిక చదువుతుండగా.. బంగ్లాదేశ్ జెర్సీని వేసుకున్న ఓ యువకుడు వచ్చి పలకరిస్తాడు. ప్రపంచకప్‌లో ఎలా రాణించాలనే అంశంపై ఇద్దరి మధ్య చర్చ నడుస్తుంటుంది. టీమిండియా జెర్సీ వేసుకున్న మరో యువకుడు వారి చర్చలో జోక్యం చేసుకుని, కొన్ని కామెంట్స్ చేస్తాడు. దీనితో పాక్ జెర్సీ ధరించిన వ్యక్తి కొంత చిన్నబుచ్చుకుంటాడు. ఈ యాడ్ పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.