పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 2024-25 సీజన్‌కు సెంట్రల్ కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. 25 మంది ఆటగాళ్లు సెంట్రల్ కాంట్రాక్ట్ పొందారు. అయితే కీలక ప్లేయర్ ఫకర్ జమాన్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. ఎనిమిదేళ్లలో అతనికి సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కకపోవడం ఇదే తొలిసారి. దీని గురించి పీసీబీ ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో స్పందించాడు.
బాబర్ అజామ్‌ను జట్టు నుంచి తప్పించడంపై 'విరాట్ కోహ్లి-భారత్'తో పోలుస్తూ చేసిన ట్వీట్ కారణంగానే ఫకర్ జమాన్‌పై వేటు విధించామని మోహ్సిన్ నఖ్వీ తెలిపాడు. దాంతో పాటు అతని ఫిట్‌నెస్ కూడా ఓ కారణమని పేర్కొన్నాడు. అందుకే సెంట్రల్ కాంట్రాక్ట్‌తో పాటు ఆస్ట్రేలియా, జింబాబ్వే పర్యటనల్లో వన్డే, టీ20 సిరీస్‌లకు ఫకర్ జమాన్ ఎంపిక కాలేదని అన్నాడు.

ఇంగ్లండ్‌తో చివరి రెండు టెస్టులకు పాకిస్థాన్ జట్టులో బాబార్ అజామ్ చోటు కోల్పోయాడు. అయితే దీని గురించి ఫకర్ జామన్ ట్వీట్ చేశాడు. ''బాబర్ అజామ్‌ను తొలగించాలన్న సూచనలు వినడం ఆందోళన కలిగిస్తోంది. 2020 నుంచి 2023 మధ్య కాలంలో విరాట్ కోహ్లి 19.33, 28.21, 26.50 సగటుతో ఉన్నప్పటికీ , అతనని భారత్ బెంచ్‌కు పరిమితం చేయలేదు''
''మన ప్రీమియర్ బ్యాటర్ బాబర్ అజామ్‌ను తొలగించాలని నిర్ణయం తీసుకుంటే.. అది జట్టులో ప్రతికూల సందేశాన్ని పంపుతుంది. మన ప్రధాన ఆటగాళ్లను అణగదొక్కడం కంటే, వారిని కాపాడుకోవడంపై దృష్టిసారించాలి'' అని ఫకర్ జమాన్ ట్వీట్ చేశాడు. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై వివరణ ఇవ్వాలని పాక్ బోరడు ఫకర్‌కు షోకాజ్ నోటీసులు కూడా పంపింది. అంతేగాక సెంట్రల్ కాంట్రాక్ట్‌ను రద్దుచేసింది.
కాగా, మీడియా సమావేశంలో మోహ్సిన్ నఖ్వీ పాకిస్థాన్ వైట్ బాల్ జట్లకు కొత్త కెప్టెన్‌ను ప్రకటించాడు. మహ్మద్ రిజ్వాన్‌ను సారథిగా ఎంపిక చేస్తున్నట్లు వెల్లడించాడు. గత రెండేళ్లలో పాకిస్థాన్ జట్టుకు సారథిగా బాధ్యతలు అందుకున్న నాలుగో వ్యక్తి రిజ్వాన్. 2023 వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ ఘోరపరాజయానికి బాధ్యత వహిస్తూ బాబార్ అజామ్ సారథి బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
అనంతరం టెస్టులకు షాన్ మసూద్, టీ20లకు షాహిన్ అఫ్రిది జట్టు పగ్గాలు అందుకున్నారు. టెస్టు ఫార్మాట్‌కు కెప్టెన్‌గా షాన్ మసూద్ కొనసాగుతున్నాడు. కానీ, ఒక్క టీ20 సిరీస్‌తోనే షాహిన్ అఫ్రిదిని తొలగించారు. తిరిగి బాబర్ అజామ్‌ను వైట్ బాల్ ఫార్మాట్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అయితే టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. దీంతో మరోసారి బాబర్ అజామ్ సారథి బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
అయితే ఈసారి బాబర్ తన ఆటపై దృష్టిసారించి ఈ నిర్ణయం తీసుకున్నాడని మోహ్సిన్ నఖ్వీ పేర్కొన్నాడు. సెలక్టర్లు జాగ్రత్తగా ఆలోచించి రిజ్వాన్‌ను కెప్టెన్‌గా నియమించారని తెలిపాడు.