కాన్ బెర్రా: పాకిస్ధాన్ క్రికెట్లో మరో కొత్త వివాదం చోటు చేసుకుంది. ఐసీసీ వరల్డ్ కప్‌లో భాగంగా ఫిబ్రవరి 21న వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన రోజు రాత్రి క్యాసినోకు వెళ్లినందుకు పాకిస్ధాన్ చీఫ్ సెలక్టర్ మెయిన్ ఖాన్‌ను తక్షణమే స్వదేశానికి వచ్చేయాలని పాకిస్ధాన్ క్రికెట్ బోర్డు ఆదేశించింది.
దీనిపై విచారణ జరిపిన పాకిస్ధాన్ క్రికెట్ బోర్డు ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకుందని బోర్డు ఛైర్మన్ షహర్యార్ ఖాన్ తెలిపారు. మెయిన్ ఖాన్ తన భార్యతో కలిసి క్రిస్ట్ చర్చ్‌లోని క్యాసినోకు రాత్రి 3 గంటల ప్రాంతంలో వెళ్లినట్లు తెలిపారు.

'జరిగిన సంఘటనపై వివరణ ఇవ్వాలని మొయిన్‌ను కోరాం. డిన్నర్ కోసమే క్యాసినోకు వెళ్లానని చెప్పాడు. అయితే ప్రపంచకప్‌లో జట్టు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో అతను అలా వెళ్లడం సరైంది కాదు. మేం వివాదరహితంగా ఉండాలని కోరుకుంటున్నాం' అని షహర్యార్ పేర్కొన్నారు.
ప్రాధమిక విచారణలో వెస్టిండిస్‌తో మ్యాచ్ ప్రారంభానికి ముందు మెయిన్ ఖాన్ తన భార్యతో కలిసి డిన్నర్ కోసం వెళ్లగా, ఓ పాకిస్ధానీ జంట ఫోటోలు తీసి వీడియోని రూపొందించింది. పూర్తి విచారణ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని షహర్యార్ తెలిపారు.