ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా తప్పుకున్న రెండు జట్లు తలపడేందుకు రెడీ అయ్యాయి. ధర్మశాల వేదికగా రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ సారధి సంజూ శాంసన్ టాస్ గెలిచాడు. తాము ముందుగా బౌలింగ్ చేస్తామని శాంసన్ వెల్లడించాడు.
ప్లేఆఫ్స్ రేసులో నామమాత్రంగా అయినా సరే ఉండాలంటే రాజస్థాన్ జట్టు ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి తీరాలి. బ్యాటింగ్‌కు పూర్తిగా సహకరిస్తున్న ఈ పిచ్‌పై టాస్ గెలవడం కచ్చితంగా రాజస్థాన్‌కు కలిసొస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో సీనియర్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ఆడటం లేదని సంజూ శాంసన్ తెలిపాడు.

అశ్విన్‌కు వెన్నునొప్పి వచ్చిందని, దీంతో అతను ఈ మ్యాచ్ ఆడటం లేదని శాంసన్ చెప్పాడు. ఇక పంజాబ్ జట్టులో ఎలాంటి మార్పులు లేవని శిఖర్ ధవన్ వెల్లడించాడు. 'ఈ గ్రౌండ్, వికెట్ చూస్తే ఛేజింగ్ చేయడమే బెటర్ అని అనిపిస్తోందని సంజూ చెప్పాడు. మేం ఈ మ్యాచ్ గెలవడంతోపాటు మిగతా మ్యాచుల్లో ఎలాంటి ఫలితం వస్తుందో కూడా గమనించాల్సి ఉంది' అని చెప్పాడు.
'మేం మంచి క్రికెట్ ఆడాలని అనుకుంటే.. పాత విషయాలు మర్చిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది చాలా ముఖ్యం. ఈ మ్యాచ్‌లో మేం చాలా ఫ్రెష్‌గా బరిలో దిగాలని అనుకుంటున్నాం' అని సంజూ అన్నాడు. అదే సమయంలో ఈ పిచ్‌పై మొదట బ్యాటింగ్ చేసినా, సెకండ్ బ్యాటింగ్ చేసినా బాగానే ఉంటుందని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్ అభిప్రాయపడ్డాడు.
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధవన్ (కెప్టెన్), అథర్వ టైడే, లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, శామ్ కర్రాన్, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, కగిసో రబాడ నాథన్ ఎల్లీస్, అర్షదీప్ సింగ్
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, ఆడమ్ జంపా, ట్రెంట్ బౌల్ట్, నవదీప్ సైనీ, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్