
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశలో భాగంగా దుబాయ్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో వికెట్లన్నీ కోల్పోయి 185 పరుగులు చేసింది. దాంతో పంజాబ్ ముందు 186 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చివరలో పంజాబ్ పేసర్ ఆర్ష్‌దీప్ సింగ్ ఐదు వికెట్లతో రాజస్థాన్ జోరుకు కళ్లెం వేశాడు. లేదంటే సంజుసేన 200 పరుగులకు పైగా చేసేదే. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (49; 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులు), ఎవిన్ లూయిస్ (36; 21 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) దంచికొట్టగా.. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ మహిపాల్ లోమ్రర్ (43; 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులు) సిక్సుల వర్షం కురిపించాడు. పంజాబ్ బౌలర్లలో ఆర్ష్‌దీప్ సింగ్ ఐదు వికెట్లు పడగొట్టగా.. మొహ్మద్ షమీ మూడు వికెట్లు తీశాడు.ఇషాన్ పోరెల్, హర్‌ప్రీత్ బ్రార్ చెరో వికెట్ తీసుకున్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మంచి శుభారంభం దక్కింది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్ అదరగొట్టారు. ఇద్దరూ చెత్త బంతులను బౌండరీలకు పంపిస్తూ జట్టు స్కోరును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే తొలి వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అయితే దూకుడుగా ఆడుతున్న లూయిస్.. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్లో మయాంక్ అగర్వాల్‌కు చిక్కాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సంజు శాంసన్ (4) రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ఇషాన్ పొరెల్ వేసిన ఎనిమిదో ఓవర్లో తొలి బంతికి రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రాహుల్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు.
సంజు శాంసన్ అనంతరం క్రీజులోకి వచ్చిన హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్ తన వంతుగా 17 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 25 పరుగులు చేశాడు. చివరకు అర్షదీప్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. ఇక నిలకడగా ఆడుతున్న యశస్వి జైస్వాల్‌ను హర్‌ప్రీత్ బ్రార్ పెవిలియన్ చేర్చడంతో రాజస్థాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. దాంతో అతడు తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోయాడు. ఆ తర్వాత క్రీజులోకి మహిపాల్ లోమ్రర్ ధనాధన్ బ్యాటింగ్‌తో స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. ఈ క్రమంలోనే ఐదో వికెట్‌గా రియాన్ పరాగ్ (4).. మహమ్మద్ షమీ వేసిన 17వ ఓవర్లో ఔట్ అయ్యాడు. కాసేపటికే మహిపాల్‌ను అర్ష్‌దీప్ బుట్టలో వేసుకున్నాడు. దాంతో రాజస్థాన్ కీలక వికెట్ కోల్పోయింది.
మహిపాల్ వికెట్ అనంతరం రాజస్థాన్ ఎక్కువగా పరుగులు చేయలేదు. 18వ ఓవర్లో రాహుల్ తెవాతియా (2), క్రిస్ మోరిస్ (5) వరుసగా వెనుదిరిగాడు. భారీ అంచనాలు పెట్టుకున్న మోరిస్ పూర్తిగా విఫలమయ్యాడు. చివర్లో వచ్చిన చేతన్ సకారియా (7), కార్తిక్ త్యాగీ (1) వేగంగా ఆడలేకపోయారు. ముస్తాఫిజుర్ రెహ్మన్ నాటౌట్‌గా నిలిచాడు. చివరలో పంజాబ్ పేసర్ ఆర్ష్‌దీప్ సింగ్ ఐదు వికెట్లతో రాజస్థాన్ జోరుకు కళ్లెం వేశాడు. లేదంటే సంజుసేన 200 పరుగులకు పైగా చేసేదే.