PBKS vs RR: చివరి ఓవర్లో కార్తీక్ త్యాగి మాయ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం!!

PBKS vs RR: Karthik Tyagi Defends 4 Runs And Gets Rajasthan Royals Thrilling Victory

దుబాయ్: చివరి ఓవర్లో పేసర్ కార్తీక్ త్యాగి అద్భుత బౌలింగ్ కారణంగా రాజస్థాన్ రాయల్స్ ఊహించని విజయాన్ని అందుకుంది. దుబాయ్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్లో పంజాబ్ కింగ్స్‌ విజయానికి 4 పరుగులు అవసరం కాగా.. కార్తీక్ త్యాగి ఒక పరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో కచ్చితంగా తమదే గెలుపు అనుకున్న కింగ్స్‌కు నిరాశే ఎదురైంది. పంజాబ్‌ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్‌ (67; 43 బంతుల్లో 7×4, 2×6), కేఎల్ రాహుల్‌ (49; 33 బంతుల్లో 4×4, 2×6) రాణించినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంకు చేరుకుంది.

చెలరేగిన అగర్వాల్, రాహుల్:
185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ కింగ్స్‌కు అద్భుతమైన ఆరంభం దక్కింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ రాజస్థాన్ రాయల్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. తొలి మూడు ఓవర్లలో నెమ్మదిగా ఆడినా.. తర్వాత వేగం పెంచారు. ఇద్దరూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ.. చెత్త బంతులను బౌండరీలు తరలించారు. అయితే రాజస్థాన్ పేలవ ఫీల్డింగ్ కారణంగా రాహుల్ మూడుసార్లు ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దీన్ని సద్వివినియోగం చేసుకున్న రాహుల్ దూకుడుగా ఆడాడు. మరోవైపు మయాంక్ కూడా వరుస బౌండరీలతో చెలరేగిపోవడంతో.. కింగ్స్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. క్రిస్ మోరిస్‌ వేసిన పదో ఓవర్‌లో మాయాంక్‌ రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.

కార్తీక్‌ త్యాగి మాయ:
చేతన్ సకారియా వేసిన 12వ ఓవర్‌లో కేఎల్ రాహుల్‌ ఔట్‌ కాగా.. తర్వాత రాహుల్ తెవాటియా వేసిన 13వ ఓవర్‌లో మయాంక్‌ అగర్వాల్ వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నికోలస్‌ పూరన్‌ (32; 22 బంతుల్లో 1×4, 2×6), ఐడెన్ మార్క్రామ్ (26) మ్యాచ్‌ను విజయతీరాలవైపు నడిపించారు. చివర్లో చివరి ఓవర్లో 4 పరుగులు కావాల్సి ఉండగా మ్యాచ్ కచ్చితంగా పంజాబ్‌‌దే అనిపించింది. కానీ కార్తిక్ త్యాగి మాయ చేశాడు. మొదటి బంతిని డాట్ బాల్‌గా వేయగా.. రెండో బంతికి మార్క్రామ్ సింగల్ తీశాడు. మూడో బంతికి నికోలస్‌ పూరన్‌ ఔట్ అయ్యాడు. తర్వాత వచ్చిన దీపక్ హుడా (0) నాలుగో బంతికే పరుగులేమి చేయలేదు. ఐదో బంతికి డకౌటయ్యాడు. దీంతో ఒక బంతికి మూడు పరుగుల చేయాల్సిన దశలో క్రీజులోకి వచ్చిన ఫాబియన్ అలెన్‌.. ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. దీంతో రాజస్థాన్‌ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. కార్తీక్‌ త్యాగి రెండు వికెట్లు తీయగా.. సకారియా, తెవాటియా తలో వికెట్‌ తీశారు.

శుభారంభం:
అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 185 పరుగులు చేసి ఆలౌటైంది. టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన రాయల్స్ జట్టు​కు మంచి శుభారంభం దక్కింది. ఓపెనర్లు ఎవిన్​ లూయిస్ (36; 21 బంతుల్లో 7x4, 1x6), యశస్వి జైస్వాల్​ (49; 36 బంతుల్లో 6x4, 2x6) అదరగొట్టారు. ఇద్దరూ చెత్త బంతులను బౌండరీలకు పంపిస్తూ జట్టు స్కోరును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే తొలి వికెట్​కు 54 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అయితే దూకుడుగా ఆడుతున్న లూయిస్​.. అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్లో మయాంక్‌ అగర్వాల్‌కు చిక్కాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ సంజు శాంసన్‌ (4) రెండో వికెట్​గా వెనుదిరిగాడు. ఇషాన్‌ పొరెల్‌ వేసిన ఎనిమిదో ఓవర్లో తొలి బంతికి రాహుల్‌కు క్యాచ్​ ఇచ్చి ఔటయ్యాడు. సంజు శాంసన్‌ అనంతరం క్రీజులోకి వచ్చిన లియామ్​ లివింగ్​స్టోన్​ 17 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 25 పరుగులు చేశాడు. చివరకు అర్షదీప్​ బౌలింగ్​లో పెవిలియన్​ చేరాడు.

ఐదేసిన ఆర్ష్‌దీప్ సింగ్:
నిలకడగా ఆడుతున్న యశస్వి జైస్వాల్​ను హర్​ప్రీత్​ బ్రార్​ పెవిలియన్ చేర్చడంతో రాజస్థాన్ కీలక వికెట్​ కోల్పోయింది​. దాంతో అతడు తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోయాడు. ఆ తర్వాత క్రీజులోకి మహిపాల్ లోమ్రర్ (43; 17 బంతుల్లో 2x4, 4x6)ధనాధన్ బ్యాటింగ్​తో స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. అయిదు ఐదో వికెట్​గా రియాన్​ పరాగ్​ (4) ఔట్ అయ్యాడు. కాసేపటికే మహిపాల్‌ను అర్ష్‌దీప్‌ బుట్టలో వేసుకున్నాడు. అనంతరం రాజస్థాన్ ఎక్కువగా పరుగులు చేయలేదు. 18వ ఓవర్లో రాహుల్​ తెవాతియా (2), క్రిస్​ మోరిస్ ​(5) వరుసగా వెనుదిరిగాడు. చివర్లో వచ్చిన చేతన్​ సకారియా (7), కార్తిక్​ త్యాగీ (1) వేగంగా ఆడలేకపోయారు. ముస్తాఫిజుర్​ రెహ్మన్​ నాటౌట్​గా నిలిచాడు. చివరలో పంజాబ్ పేసర్ ఆర్ష్‌దీప్ సింగ్ ఐదు వికెట్లతో రాజస్థాన్ జోరుకు కళ్లెం వేశాడు. లేదంటే సంజుసేన 200 పరుగులకు పైగా చేసేదే.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, September 21, 2021, 23:52 [IST]
Other articles published on Sep 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X