
కెప్టెన్ ఫాఫ్ డుప్లిసెస్‌కు విధ్వంసానికి తోడు దినేష్ కార్తీక్ మెరుపు ఇన్నింగ్స్, విరాట్ కోహ్లీ సైతం రాణించడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోర్ సాధించింది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 205 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ ముందు 206 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది. ఆర్సీబీ బ్యాటర్ల విధ్వంసాన్ని పంజాబ్ కింగ్స్ బౌలర్లు ఏ మాత్రం అడ్డుకోలేకపోయారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఓపెనర్లు అనుజ్ రావత్, ఫాఫ్ డుప్లిసెస్ శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 21 పరుగులు చేసిన అనుజ్ రావత్ (2 ఫోర్లు, ఒక సిక్సు)ను పంజాబ్ బౌలర్ రాహుల్ చాహర్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో కెప్టెన్ ఫాఫ్ డుప్లిసెస్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో జత కట్టాడు. ఇద్దరు కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇద్దరు కలిసి రెండో వికెట్‌కు 61 బంతుల్లోనే 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న డుప్లిసెస్ ఓ దశలో సెంచరీ కొట్టేలా కనిపించాడు. కానీ 88 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో షారూక్ ఖాన్‌ను క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. షారూక్ ఖాన్ అద్భుత ఫీల్డింగ్‌తో క్యాచ్ పట్టడంతో డుప్లిసెస్ ఇన్నింగ్స్ ముగిసింది. 57 బంతులు ఎదుర్కొన్న అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 7 సిక్సులు ఉన్నాయి.
అనంతరం విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్కోర్ బోర్డును మరింత వేగంగా పరిగెత్తించారు. వీరిద్దరు 17 బంతుల్లోనే అజేయంగా 37 పరుగులు జోడించారు. దినేష్ కార్తీక్ అయితే 14 బంతుల్లోనే 32 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. ఇక కోహ్లీ 29 బంతుల్లోనే 41 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్, 2 సిక్సులు ఉన్నాయి. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ చాహర్ తలో వికెట్ తీశారు.