
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు పంజాబ్ కింగ్స్ షాకిచ్చింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు 206 పరుగుల లక్ష్యాన్ని చేధించి విజయాన్ని అందుకోవడం గమనార్హం. మహ్మద్ సిరాజ్ వేసిన 18వ ఓవర్లో 25 పరుగులు సమర్పించుకోవడంతో పంజాబ్ విజయతీరాలకు చేరింది. చివర్లో 8 బంతుల్లోనే 25 పరుగులు చేసిన స్మిత్ ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఓపెనర్లు శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్ శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు 7 ఓవర్లలోనే తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 32 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్.. హసరంగ బౌలింగ్‌లో షాబాజ్ అహ్మద్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత శిఖర్ ధావన్, భానుక రాజసక్స రెండో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. 11.2 ఓవర్లలో జట్టు స్కోర్ 118 పరుగుల వద్ద ఉండగా శిఖర్ ధావన్(29 బంతుల్లో 43 పరుగులు)ను హర్షల్ పటేల్ ఔట్ చేశాడు. 14వ ఓవర్లో వరుస బంతుల్లో మహ్మద్ సిరాజ్.. రాజపక్సే (43), రాజ్ బవా (0)ను ఫెమిలియన్ చేర్చాడు. దీంతో పంజాబ్ 139 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. 15 ఓవర్లలో 156 పరుగుల వద్ద లివింగ్ స్టోన్ (19) కూడా ఔటవడంతో మ్యాచ్ ఆర్సీబీనే గెలిచేలా కనిపించింది.
కానీ ఈ సమయంలో షారూక్ ఖాన్, ఓడియన్ స్మిత్ చెలరేగారు. విజయానికి 18 బంతుల్లో 36 పరుగులు కావాల్సిన సమయంలో మహ్మద్ సిరాజ్ వేసిన 18వ ఓవర్‌తో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ ఓవర్ తొలి 3 బంతులను ఓడియన్ స్మిత్ 6, 4, 6 బాదాడు. ఆ తర్వాత ఓ సింగిల్ రాగా, చివరి బంతిని ఓడియన్ స్మిత్ మళ్లీ సిక్స్ బాదాడు. మొత్తంగా ఆ ఓవర్లో 25 పరుగులు రావడంతో మ్యాచ్ పంజాబ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఓవర్లో విజయాన్ని అందుకుంది. దీంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే పంజాబ్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఓడియన్ స్మిత్ 8 బంతుల్లోనే 25 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో 3 సిక్సులు, ఓ ఫోర్ ఉన్నాయి. షారూక్ ఖాన్ కూడా 24 పరుగులతో అజేయంగా నిలిచాడు.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఓపెనర్లు అనుజ్ రావత్, ఫాఫ్ డుప్లిసెస్ శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 21 పరుగులు చేసిన అనుజ్ రావత్ (2 ఫోర్లు, ఒక సిక్సు)ను పంజాబ్ బౌలర్ రాహుల్ చాహర్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో కెప్టెన్ ఫాఫ్ డుప్లిసెస్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో జత కట్టాడు. ఇద్దరు కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇద్దరు కలిసి రెండో వికెట్‌కు 61 బంతుల్లోనే 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న డుప్లిసెస్ ఓ దశలో సెంచరీ కొట్టేలా కనిపించాడు. కానీ 88 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో షారూక్ ఖాన్‌ను క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. షారూక్ ఖాన్ అద్భుత ఫీల్డింగ్‌తో క్యాచ్ పట్టడంతో డుప్లిసెస్ ఇన్నింగ్స్ ముగిసింది. 57 బంతులు ఎదుర్కొన్న అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 7 సిక్సులు ఉన్నాయి.
అనంతరం విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్కోర్ బోర్డును మరింత వేగంగా పరిగెత్తించారు. వీరిద్దరు 17 బంతుల్లోనే అజేయంగా 37 పరుగులు జోడించారు. దినేష్ కార్తీక్ అయితే 14 బంతుల్లోనే 32 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. ఇక కోహ్లీ 29 బంతుల్లోనే 41 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్, 2 సిక్సులు ఉన్నాయి. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ చాహర్ తలో వికెట్ తీశారు.
స్కోర్లు:
ఆర్సీబీ: 205-2.
పంజాబ్- 2-8-5.