ఐపీఎల్-2024 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కథ ముగిసింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో 60 పరుగుల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్‌లో ఎలిమినేట్ అయిన రెండో జట్టుగా ముంబై ఇండియన్స్‌తో జతకట్టింది. ఐపీఎల్ 17 సీజన్లలో పంజాబ్ గ్రూప్ దశలోనే ఎలిమినేట్ అవ్వడం ఇది 15వ సారి కావడం గమనార్హం.
ధర్మశాల వేదికగా జరిగిన ఈ డూ ఆర్ డై మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 241 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (92; 47 బంతుల్లో, 7x4, 6x6) సెంచరీ చేజార్చుకున్నాడు. రజత్ పటిదార్ (55; 23 బంతుల్లో, 3x4, 6x6), కామెరూన్ గ్రీన్ (46; 27 బంతుల్లో, 5x4, 1x6) రాణించారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు (3/38), అరంగేట్ర ప్లేయర్ విద్వాత్ కవెరప్ప (2/36) రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు.

అనంతరం పంజాబ్ కింగ్స్ 17 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. రొసో (61; 27 బంతుల్లో, 9x4, 3x6) టాప్ స్కోరర్. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ (3/43) మూడు వికెట్లు, స్వప్నిల్ సింగ్ (2/28), ఫెర్గూసన్ (2/29), కర్ణ్ శర్మ (2/36) తలో రెండు వికెట్లు తీశారు. 125/3తో ఉన్న పంజాబ్ 56 పరుగుల వ్యవధిలోనే చివరి ఏడు వికెట్లు కోల్పోయింది.
కాగా, మ్యాచ్ అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కరన్ మాట్లాడాడు. ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించడం చాలా బాధగా ఉందని తెలిపాడు. వచ్చే ఏడాదిలో బలంగా తిరిగొస్తామని అన్నాడు. ''నిరాశగా ఉంది. ఈ సీజన్‌లో ఎన్నో సానుకూలాంశాలు ఉన్నాయి. కానీ, దురదృష్టవశాత్తు కావాల్సిన విజయాలు సాధించి మా గమ్యాన్ని చేరుకోలేకపోయాం. ధావన్ దూరమయ్యాడని వైఫల్యానికి కారణంగా చెప్పలేం. మా జట్టులో ఉత్తమ ప్లేయర్లు ఉన్నారు''
''తలెత్తుకుంటూ, నేర్చుకుంటూ మేం మరింత మెరుగ్గవ్వాలి. గొప్ప ప్లేయర్లు ఉన్న ఈ బృందానికి నాయకత్వం వహించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సీజన్‌లో కొన్ని ఘనతలు సాధించాం, రికార్డు ఛేజింగ్ చేశాం. కానీ అంతిమంగా గమ్యానికి చేరుకోలేకపోవడం బాధగా ఉంది. మా అభిమానులకు క్షమాపణలు. మేం మా పోరాటం కొనసాగిస్తాం. వచ్చే ఏడాది బలంగా తిరిగొస్తాం'' అని సామ్ కరన్ పేర్కొన్నాడు. 12 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది.