PBKS vs RCB: మ్యాచ్ టర్నింగ్ పాయింట్.. బెంగళూరును ముంచిన ఆ తప్పిదాలు ఇవే!!

అహ్మదాబాద్: శుక్రవారం నరేంద్ర మోడీ మైదానంలో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన పంజాబ్ కింగ్స్ 34 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (91 నాటౌట్; 57 బంతుల్లో 7×4, 5×6), యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (46; 24 బంతుల్లో 6×4, 2×6), యువ ఆటగాడు హర్‌ప్రీత్ బ్రార్ (25 నాటౌట్; 17 బంతుల్లో 1×4, 2×6) చెలరేగడంతో మొదట పంజాబ్ 5 వికెట్లకు 179 పరుగులు చేసింది.
ఛేదనలో హర్‌ప్రీత్ (3/19) స్పిన్ మాయలో పడి బెంగళూరు 8 వికెట్లకు 145 పరుగులే చేసి ఓడింది. రవి బిష్ణోయ్ (2/17) కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. విరాట్ కోహ్లీ (35; 34 బంతుల్లో 3×4, 1×6) టాప్ స్కోరర్. మ్యాచ్ ఓడడానికి బెంగళూరు చేసిన తప్పిదాలను ఓసారి చూద్దాం.

ఒకే ఓవర్‌లో ఐదు బౌండరీలు
బాంగళూరుపై పంజాబ్ కింగ్స్ హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్ (46: 24 బంతుల్లో 6x4, 2x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో ఉన్నది కొద్దిసేపు అయినా.. తన మార్క్ షాట్లతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్ మినీ వేలంలో రూ.15 కోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేసిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కైల్ జెమీషన్‌ని యూనివర్సల్ బాస్ ఓ ఆటాడుకున్నాడు. జెమీషన్ వేసిన ఆరవ ఓవర్‌లో ఐదు బౌండరీలు (4,4,4,4,0,4) బాది 20 పరుగులు పిండుకున్నాడు. ఐదో బంతి కూడా బౌండరీ సాధించేవాడే. కానీ.. ఫీల్డర్ డైవ్ చేయడంతో అది సేవ్ అయ్యింది. అక్కడే పంజాబ్ ఇన్నింగ్స్ ఊపందుకుంది. ఒకవేళ జెమీషన్ బాగా బౌలింగ్ చేసుంటే.. పంజాబ్ భారీ స్కోర్ చేసేది కాదు.

చివరి ఓవర్లో 22 పరుగులు
హర్షల్ పటేల్.. ఐపీఎల్ 2021లో అత్యధిక వికెట్ల ధీరుడు. 14వ సీజన్ ఆరంభం నుంచి పొదుపుగా బౌలింగ్ చేస్తూ.. వికెట్లు తీస్తున్న ఈ పేసర్ చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా దెబ్బకు హడలిపోయాడు. చివరి ఓవర్ వేసి ఏకంగా 37 పరుగులు ఇచ్చుకున్నాడు. జడేజా 5 సిక్సర్లు, ఒక ఫోర్, రెండు పరుగులు సాధించి మొత్తం (ఒక నోబాల్) 37 రన్స్ పిండుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌పై కూడా మరోసారి చివరి ఓవర్లో తేలిపోయాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (2 ఫోర్లు, ఓ సిక్స్) కొత్త కుర్రాడు హర్ప్రీత్ బ్రార్ (ఓ సిక్స్) 22 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో పంజాబ్ అదనంగా 15 పరుగులు చేసింది. హర్షల్ మెరుగ్గా బౌలింగ్ చేసుంటే ఫలితం మరోలా ఉండేది.
Chandro Tomar: కరోనాతో పోరాడుతూ.. 'షూటర్ దాది' కన్నుమూత!!

తిప్పేసిన హర్‌ప్రీత్ బ్రార్
ఛేదనలో బెంగళూరులో జోరే లేదు. 10 ఓవర్లలో బెంగళూరు చేసింది 62 రన్స్. అప్పటికి విరాట్ కోహ్లీ 33 బంతుల్లో 35 చేయగా.. రజత్ పటీదార్ 21 బంతుల్లో 15 పరుగులే చేశాడు. చేతిలో వికెట్లు ఉండడంతో బెంగళూరుకు అవకాశాలు ఉన్నాయి. కానీ ఎడమచేతి వాటం స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్ .. అద్భుతమైన బౌలింగ్‌తో ఆ జట్టును చావు దెబ్బతీశాడు.
వెంటవెంటనే మూడు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. 11వ ఓవర్లో వరుస బంతుల్లో కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (0)లను బౌల్డ్ చేసిన బ్రార్.. తన తర్వాతి ఓవర్లోనే స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ (3)నూ బోల్తా కొట్టించాడు. కేవలం 7 బంతుల్లోనే ఈ ముగ్గురినీ అతడు పెవిలియన్‌కి పంపడం గమనార్హం. అంతే అక్కడి నుంచి బెంగళూరు కోలుకోలేకపోయింది. మ్యాచులో ఇదే టర్నింగ్ పాయింట్. బెంగళూరు కీలక వికెట్లు కోల్పోకుంటే విజయం సాధించేదే.

టాప్ ఆర్డర్ మీదే భారం
ముందుగా బ్యాటింగ్ చేసినా లేదా లక్ష్య ఛేదనలో అయినా సరే బెంగళూరు టాప్ ఆర్డర్ మీదే ఆధారపడుతోంది. దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ మెరుపు ఆరంభాలు ఇస్తే.. గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్ స్వేచ్ఛగా బ్యాట్ జులిపేస్తున్నారు. ఒకవేళ ఓపెనర్లు విఫలమైతే భారం మొత్తం మ్యాక్స్‌వెల్, డివిలియర్స్ మీదే పడుతోంది. ఇప్పటివరుకు ఈ నాలుగురు మెరిశారు కాబట్టే బెంగళూరు విజయాలు అందుకుంది. కోహ్లీసేన ఓడిన రెండు మ్యాచుల్లో టాప్ ఆర్డర్ విఫలం అయింది. రజత్ పాటిదార్, వాషింగ్టన్ సుందర్, డాన్ క్రిస్టియన్ బ్యాటింగ్‌లోనూ నిరాశపరుస్తున్నారు. మిడిల్ ఆర్డర్ పటిష్టంగా ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications