ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ కీలక పోరులో గెలిచి ప్లేఆఫ్స్ రేసులో సీఎస్కే ముందంజలో నిలిచింది. పాయింట్ల పట్టికలో అయిదో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 167 పరుగులు చేసింది.
రవీంద్ర జడేజా (46; 26 బంతుల్లో, 3x4, 2x6) టాప్ స్కోరర్. రుతురాజ్ గైక్వాడ్ (32; 21 బంతుల్లో, 4x4, 1x6), డారిల్ మిచెల్ (30; 19 బంతుల్లో, 2x4, 1x6) కీలక పరుగులు సాధించారు. శివమ్ దూబె, ఎంఎస్ ధోనీ ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్‌కు చేరారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ (3/23), హర్షల్ పటేల్ (3/24) చెరో మూడు వికెట్లతో సత్తాచాటారు.

అనంతరం ఛేదనలో 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 139 పరుగులే చేసింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (30; 23 బంతుల్లో, 2x4, 2x6), శశాంక్ సింగ్ (27; 20 బంతుల్లో, 4x4) టాప్ స్కోరర్లు. సీఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజా (3/20) మూడు, సిమర్జీత్ సింగ్ (2/16), తుషార్ దేశ్‌పాండే (2/35) చెరో రెండు వికెట్లు తీశారు.
అయితే ఈ మ్యాచ్‌లో ధోనీ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. హర్షల్ పటేల్ వేసిన స్లో డెలివరీకీ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీనిపై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ స్పందించాడు. ఆ స్థానంలో ధోనీ బ్యాటింగ్‌కు రావడం కంటే తుదిజట్టు నుంచి తప్పుకోవడమే ఉత్తమమని అన్నాడు. మరో ఫాస్ట్ బౌలర్‌కు అవకాశం ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ధోనీ కంటే ముందుగా శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్‌కు రావడంపై భజ్జీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
''తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేయాలనుకుంటే ఎంఎస్ ధోనీ ఆడకపోవడమే మంచిది. అతని స్థానంలో తుదిజట్టులో ఫాస్ట్ బౌలర్ ఉండటం ఉత్తమం. ధోనీ డెసిషన్ మేకర్. అతను ఆలస్యంగా బ్యాటింగ్‌కు వచ్చి జట్టును నిరాశపరిచాడు. ధోనీలా శార్దూల్ ఠాకూర్ షాట్లు ఆడలేడు. ధోనీ ఈ పొరపాటును ఎందుకు చేశాడో అర్థం కావట్లేదు. అతని అనుమతి లేకుండా అక్కడ ఏదీ జరగదు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ధోనీ ఆఖర్లో వెళ్లాలనే నిర్ణయాన్ని ఇతరులు తీసుకున్నారని నేను భావించట్లేదు'' హర్భజన్ సింగ్ అన్నాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శార్దూల్ 11 బంతుల్లో 17 పరుగులు చేశాడు.