టీ20 క్రికెట్‌లో అందరూ బ్యాటింగ్ గురించే మాట్లాడతారు. కానీ బంతితోనూ అద్భుతాలు సృష్టించొచ్చు అని కొందరు బౌలర్లు నిరూపిస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఆసీస్ పేసర్ నాథన్ ఎల్లీస్ కూడా ఒకడు అనే చెప్పాలి. బిగ్ బ్యాష్ వంటీ టీ20 లీగుల్లో ఫర్వాలేదనిపించిన అతను ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున పెద్దగా రాణించలేదు. ఇప్పుడు టీ20 బ్లాస్ట్‌లో మాత్రం అదరగొట్టాడు.
ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్‌లో కేవలం నాలుగు బంతుల్లోనే ఏకంగా మూడు వికెట్లు తీసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. హాంప్‌షైర్ తరఫున ఆడుతున్న ఎల్లీస్.. వార్సెస్టర్‌షైర్‌తో మ్యాచ్‌లో బంతితో నిప్పులు చెరిగాడని చెప్పాలి. వార్సెస్టర్‌షైర్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన అతను.. ఒక్కటంటే ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు తీసుకొని ప్రత్యర్థికి షాకిచ్చాడు. ఈ మ్యాచ్‌లో 2.5 ఓవర్లు బౌలింగ్ చేసిన అతను.. కేవలం 6 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకోవడం గమనార్హం.

ఇలా ఎల్లీస్ చెలరేగడంతో హాంప్‌షైర్ బ్యాటర్లు తేలిపోయారు. అతనితోపాటు క్రిస్ వుడ్, జాన్ టర్నర్ కూడా చెరో రెండేసి వికెట్లతో రాణించడంతో 17.5 ఓవర్లలో కేవలం 100 పరుగులకే ఆ టీం ఆలౌట్ అయిపోయింది. చివర్లో ఎడ్ పొలాక్ (24 నాటౌట్), ఉసామా మిర్ (39) ఫర్వాలేదనిపించారు. లేదంటే ఆ జట్టు ఈ మాత్రం స్కోరు కూడా చేసేది కాదు. ఇక లక్ష్య ఛేదనలో హాంప్‌షైర్ కూడా తడబడిందనే చెప్పాలి.
కెప్టెన్ జేమ్స్ విన్స్ (19) పెద్దగా ఆకట్టుకోలేదు. మరో ఓపెనర్ డొనాల్డ్ (5) దారుణంగా విఫలమయ్యాడు. ఇలాంటి సమయంలో టామ్ ప్రెస్ట్ (25), జో వెదర్లీ (25) ఆ జట్టును ఆదుకున్నారు. వీళ్లిద్దరూ ఇన్నింగ్స్ చక్కదిద్దడంతో హాంప్‌షైర్ కేవలం 15.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వార్సెస్టర్‌షైర్ బౌలర్లలో ఉసామా మిర్, ఆడమ్ ఫించ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.