
హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ భుజాన్ని గుద్దుకుంటూ వెళ్లిన రబాడకు ఐసీసీ నిషేదాన్ని విదించిన సంగతి తెలిసిందే. అయితే ఈ గొడవలోకి తాజాగా కోహ్లీని లాగుతున్నాడు మరో దక్షిణాఫ్రికా ఆటగాడు పాల్ హారిస్.
రబాడపై ఐసీసీ రెండు మ్యాచుల నిషేధంతో పాటు మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పెట్టిన సంగతి తెలిసిందే. దాంతో పాటు మూడు డీమెరిట్ పాయింట్లను అతడి ఖాతాలో వేసింది. తద్వారా రెండేళ్లలో అతడు 8 డీమెరిట్ పాయింట్లను సాధించి తన మీద ఓ చెడు భావాన్ని తెప్పించుకున్నట్టయింది.
దక్షిణాఫ్రికా టూర్‌లో భాగంగా కోహ్లీ ఓ జోకర్‌లా ప్రవర్తించాడని, అయినా అతడిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎలాంటి చర్యలూ తీసుకోలేదని అతడు అన్నాడు. రబాడను సమర్దిస్తూ అతనంత పెద్ద తప్పేం చేయలేదని వెనకేసుకొచ్చాడు.
'దక్షిణాఫ్రికాతో ఆడిన మూడు టెస్టుల్లోనూ కోహ్లీ చిల్లరగా, ఓ జోకర్‌లా వ్యవహరించాడు. కానీ, ఆ విషయంలో మాత్రం ఎలాంటి చర్యలూ లేవు. రబాడతో ఐసీసీకి ఏదో ఇబ్బంది ఉందని నాకు అనిపిస్తోంది. లేదంటే దక్షిణాఫ్రికాతోనైనా ఏదైనా ఇబ్బంది ఉందేమో'' అని హారిస్ ట్వీట్ చేశాడు.
జరిగిన విషయానికి స్పందించిన రబాడనే అలా చేసుండాల్సింది కాదని పశ్చాత్తాప్పడ్డాడు. తను తప్పు నుంచి పాఠం తెలుసుకుంటానని పేర్కొన్నాడు. మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటానని పేర్కొన్నాడు. అలాంటిది రబాడకే లేని ఆరాటం పాల్ హారిస్‌కు ఎందుకో అని సగటు విరాట్ అభిమానులు స్పందిస్తున్నారు.