IPL 2026: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొత్త కెప్టెన్ ను నియమిస్తారనే వార్తలకు జట్టు యాజమాన్యం పుల్‌స్టాప్ పెట్టింది. వచ్చే ఐపీఎల్ సీజన్‌లోనూ ఆస్ట్రేలియా పేస్ సంచలనం ప్యాట్ కమిన్స్ కెప్టెన్‌గా ఉంటారంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టును షేర్ చేసింది.ఈ నేపథ్యంలో ప్యాట్ కమిన్స్ మరోసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌కు కూడా అతడినే కెప్టెన్‌గా కొనసాగిస్తున్నట్లు ఫ్రాంఛైజీ అధికారికంగా ప్రకటించింది. దీంతో కమిన్స్‌కు వరుసగా ఇది మూడో సీజన్ కానుంది.ఈ కీలక విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ ఎక్స్ హ్యాండిల్ ద్వారా ప్యాట్ కమిన్స్ చిత్రాలను పంచుకుంటూ ధ్రువీకరించింది. అయితే ఇతర వివరాలను మాత్రం వెల్లడించలేదు.
భారీ ధర.. అద్భుత విజయాలు
ప్యాట్ కమిన్స్ 2024 ఐపీఎల్ సీజన్‌కు ముందు ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అంతకు ముందు దక్షిణాఫ్రికా ప్లేయర్ ఎయిడెన్ మార్‌క్రమ్ ఈ బాధ్యతలు నిర్వహించేవాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్, 2023 వన్డే వరల్డ్ కప్ విజయాల తర్వాత 2024 వేలంలో ఆస్ట్రేలియా ఆటగాడైన ప్యాట్ కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ. 20.50 కోట్లకు కొనుగోలు చేసింది.ఎస్‌ఆర్‌హెచ్‌లో చేరడానికి ముందు ప్యాట్ కమిన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తరపున కూడా ఆడాడు.

గాయం కారణంగా యాషెస్ టెస్టుకు దూరం
ఐపీఎల్ కెప్టెన్సీని ఖరారు చేసుకున్నప్పటికీ..ప్యాట్ కమిన్స్ ప్రస్తుతం గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. వెన్నునొప్పి కారణంగా అతను పెర్త్‌లో నవంబర్ 21న ప్రారంభమయ్యే తొలి యాషెస్ టెస్టు నుంచి అధికారికంగా తప్పుకున్నాడు. అయితే, డిసెంబర్ 4న బ్రిస్బేన్‌లో ప్రారంభమయ్యే రెండో టెస్టు సమయానికి అతను తిరిగి జట్టులోకి వస్తాడని భావిస్తున్నారు. కమిన్స్ గైర్హాజరీలో, స్టీవెన్ స్మిత్ యాషెస్ సిరీస్‌లోని తొలి టెస్టులో ఆస్ట్రేలియాకు నాయకత్వం వహిస్తాడు.