Pat Cummins: సౌథీ నుంచి మస్తు నేర్చుకున్నా.. ఇక డిసిప్లన్‌గా బౌలింగ్ చేస్తా

పాట్ కమ్మిన్స్ ముంబైతో జరిగిన మ్యాచ్‌లో తిరిగి కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ 11లో ఛాన్స్ దక్కించుకుని సంచలనాత్మకమైన పునరాగమనం చేశాడు. ఈ మ్యాచ్‌లో విన్నింగ్ స్పెల్ వేశాడు. తన బౌలింగ్‌తో ముంబై ఇండియన్స్ శక్తివంతమైన బ్యాటింగ్ లైనప్‌కు సవాల్ విసిరాడు. కమిన్స్ తన 4ఓవర్ల కోటాలో ముగ్గురు బ్యాటర్లను అవుట్ చేశాడు. కేవలం 22పరుగులు మాత్రమే ఇచ్చాడు. అతనితో పాటు జట్టు సమిష్టి ప్రదర్శన వల్ల ముంబై 113పరుగులకే ఆలౌటైంది. దీంతో కోల్‌కతా చివరికి 52పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

సౌథీ రాణిస్తుండడంతో కమిన్స్‌కు అవకాశాలే దక్కలేదు
ఐపీఎల్ 2022 ప్లేఆఫ్ రేసులో ఇంకా సజీవంగా ఉండేందుకు కేకేఆర్‌కు ముంబైతో జరిగిన మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మ్యాచ్ కోసం కేకేఆర్ తన తుది జట్టులో ఐదు మార్పులు చేసింది. అందులో కమిన్స్ కూడా ఉన్నాడు. అతను గత మ్యాచ్‌లలో పేలవంగా బౌలింగ్ చేయడంతో కేకేఆర్ యాజమాన్యం అతన్ని బెంచ్ కే పరిమితం చేసింది. ఈక్రమంలో న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మంచి ఎకానమీతో బౌలింగ్ వేశాడు. దీంతో కేకేఆర్ టీమ్ మేనేజ్‌మెంట్ కమిన్స్‌ను తుది జట్టులోకి తీసుకోనే లేదు.

చావోరేవో అనే సిచువేషన్లో..
వరుస పరాజయాల తర్వాత చావోరేవో అన్న సిచువేషన్లో ఆసీస్ ఆల్ రౌండర్ అయిన కమిన్స్ తిరిగి జట్టులోకి చేరాడు. తద్వారా జట్టుకు భారీ లాభం చేకూరింది. ఇక కేకేఆర్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కమిన్స్ మాట్లాడుతూ.. 'ఈ ఐపీఎల్లో తాను ఆడిన మొదటి నాలుగు మ్యాచ్‌లలో నేను నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేదు. దీంతో బెంచ్ కే పరిమితమయ్యాను. ఈక్రమంలో టిమ్ సౌథీ జట్టులో చేరి అద్భుతంగా బౌలింగ్ చేస్తుండడం చూసి చాలా నేర్చుకున్నానని' కమిన్స్ పేర్కొన్నాడు.

క్రమశిక్షణతో బౌలింగ్ చేయాలని ఫిక్సయ్యా
'నేను జట్టులో లేని మ్యాచ్‌లలో టిమ్ సౌథీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయినా ఓ అవకాశం కోసం చూశాను. అందుకు రెడీగా ఉండి ప్రాక్టీసు చేశాను. తుది జట్టులో అవకాశం ఉంటుందనే పిలుపు వస్తుందని ఆశించాను. ఇక ఈ మ్యాచ్‌లో ఉమేష్ యాదవ్ గాయపడడం నాకో అవకాశాన్ని అందించింది. బెంచ్‌కే పరిమితమైనప్పుడు నా స్థానంలో బరిలో దిగిన సౌథీ బౌలింగ్ చేస్తున్నప్పుడు చూశాను. అతను ఎలాంటి బంతులు వేస్తున్నాడో గమనించాను. అతని నుంచి చాలా లెస్సన్స్ నేర్చుకున్నాను. అతనిలాగే అవకాశం వచ్చినప్పుడు క్రమశిక్షణతో బౌలింగ్ చేయాలని ప్రయత్నించాను' అని కమిన్స్ పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో కేకేఆర్ జట్టు తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంది. ఆ జట్టు 12గేమ్‌లలో ఐదు విజయాలతో ప్రస్తుతం ఏడో స్థానంలో కొనసాగుతోంది. ప్లేఆఫ్ రేసులో సజీవంగా ఉండాలంటే మిగిలిన రెండు గేమ్‌లను భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి ఆ జట్టుకు నెలకొంది. అది కూడా మిగతా జట్ల గెలుపోటములు కూడా ఆ జట్టుకు అనుకూలించాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications