
ప్యాట్ కమిన్స్:
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ 2021 రెండో దశ నుంచి తప్పుకున్నాడు. కమిన్స్ సతీమణి సెప్టెంబర్ నెలాఖరులో బిడ్డకు జన్మనివ్వనుంది. అందుకే సతీమణిని దగ్గరుండి చూసుకునేందుకు అతడు ఐపీఎల్ ఆడడం లేదు. 'ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఐపీఎల్ ఆడలేను. నా సతీమణి కడుపుతో ఉంది. ఐపీఎల్ మధ్యలోనే మా జీవితంలోకి పండంటి బిడ్డ రానుంది. ఐపీఎల్ కోసం యూఏఈ వెళితే.. ప్రస్తుత ప్రయాణ ఆంక్షల నడుమ ఆ సమయంలో నేను ఆస్ట్రేలియాకు తిరిగిరావడం కష్టమవుతోంది. కనీసం రెండు వారాల క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. అందుకే ఐపీఎల్‌కు దూరంగా ఉన్నా' అని కమిన్స్ తాజాగా తెలిపాడు. ఐపీఎల్ 2020 ముందు కోల్‌కతా రూ.15.5 కోట్ల భారీ ధరకు అతన్ని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

జోస్ బట్లర్:
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు గట్టి షాకే తగిలింది. రాజస్థాన్ స్టార్ ఓపెనర్, ఇంగ్లండ్ ప్లేయర్ జోస్ బట్లర్ యూఏఈ వేదికగా జరిగే సెకండాఫ్ లీగ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం శనివారం ట్విటర్ వేదికగా ప్రకటించింది. జోస్ బట్లర్ భార్య లూయిస్ వెబ్బర్.. త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. అప్పుడు ఆమెకు తోడుగా ఉండాలని బట్లర్ ఈ నిర్ణయం తీసుకున్నాడని రాజస్థాన్ ఫ్రాంచైజీ తెలిపింది. బట్లర్‌కు రెండేళ్ల కూతురు ఉంది. ఈ సీజన్‌లో మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన బట్లర్ 36.28 సగటుతో 254 రన్స్ చేశాడు. బట్లర్ స్థానంలో తీసుకునే ఆటగాడి వివరాలను రాజస్థాన్ ఇంకా వెల్లడించలేదు.

రిచర్డ్‌సన్, జంపా:
ఆర్‌సీబీ తరపున ఆడుతున్న ఆస్ట్రేలియా ప్లేయర్స్ కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జంపాలు కరోనా భయంతో లీగ్ మధ్యలోనే జట్టును వదిలి స్వదేశానికి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. తాజాగా యూఏఈ వేదికగా జరిగే లీగ్‌కు కూడా వారు దూరంగా ఉన్నారు. టీ20 ప్రపంచకప్ ఆసీస్ జట్టులో చోటుదక్కించుకున్న ఈ ఇద్దరు మెగా టోర్నీకి సన్నద్ధం కావడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. రిచర్డ్‌సన్‌ను ఆర్‌సీబీ నాలుగు కోట్లకు తీసుకుంది. అయితే జంపా స్థానంలో శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగాను తీసుకున్న ఆర్‌సీబీ.. రిచర్డ్‌సన్ రిప్లేస్‌మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తోంది.

రిచర్డ్‌సన్, మెరిడిత్:
పంజాబ్ జట్టుకు ఆడుతున్న ఆసీస్ బౌలర్లు జై రిచర్డ్‌సన్, రిలే మెరిడిత్‌లు రెండో దశ మ్యాచులకు దూరంగా దూరమయ్యారు. ఈ ఇద్దరూ గాయాలతో సతమతమవుతున్నారు. ఈ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో ఈ ఇద్దరిని పంజాబ్ రూ.14 కోట్లు, రూ. 8 కోట్ల భారీ ధరకు తీసుకుంది. వారి గైర్హాజరీతో టీమ్ బౌలింగ్ ఇప్పుడు బలహీనపడింది. షమీ ఒక్కడే పంజాబ్ జట్టును ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. పంజాబ్ ప్లే ఆఫ్స్ చేరాలంటే రిచర్డ్‌సన్, మెరిడిత్‌లకు బ్యాకప్ బౌలర్లు ఉండాల్సిందే. ఈ ఇద్దరు స్థానాల్లో సత్తావున్న బౌలర్లు జట్టులోకి వస్తేనే పంజాబ్ మ్యాచులు గెలవగలదు.

సామ్స్, అలెన్, ఆర్చర్:
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు ఆడుతున్న డేనియల్ సామ్స్, ఫిన్ అలెన్ కూడా ఐపీఎల్ 2021 నుంచి తప్పుకున్నారు. మానసిక ఆరోగ్య కారణాల వల్ల ఆస్ట్రేలియన్ ప్లేయర్ సామ్స్ లీగ్ నుంచి వైదొలిగాడు. న్యూజిలాండ్ ప్లేయర్ అలెన్ జాతీయ జట్టుకు ఆడే క్రమంలో ఐపీఎల్ టోర్నీకి దూరమయ్యాడు. గాయంతో రాజస్థాన్ రాయల్స్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ దూరం కాగా.. స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. మానసిక సమస్యలతో స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు బ్రేక్ తీసుకున్నాడు. మరోవైపు బట్లర్ కూడా దూరమవడంతో రాజస్థాన్ బలహీనంగా మారిపోయింది.


Click it and Unblock the Notifications












