IPL 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమైంది. ఐసీసీ టోర్నమెంట్లలో ఎప్పుడూ బలంగా కనిపింటే ఆస్ట్రేలియా జట్టు ఈ సారి కాస్త బలహీనంగా కనిపిస్తోంది. దీనికి కారణం ఆ జట్టులోని కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించడమే. ఇదే కాకుండా ఈ ఆటగాళ్లు ఐపీఎల్ 2025 నుంచి బయటపడే ముప్పును కూడా ఎదుర్కొంటున్నారు.
ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్, ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ వంటి మ్యాచ్ విన్నింగ్ ఆటగాళ్లు గాయాల కారణంగా ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి వైదొలిగారు. ఈ నేపథ్యంలో ఈ ఆటగాళ్లను సొంతం చేసుకున్న ఐపీఎల్ జట్ల కూడా కాస్త ఆందోళన పెరిగింది. ఈ క్రమంలో ఈ ముగ్గురు ఆటగాళ్లలో ఒకరు ఐపీఎల్ లో ఆడేందుకు సిద్ధమవుతున్నట్లు సూచించారు. అతడెవరో కాదు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా వ్యవహరించిన పాట్ కమ్మిన్స్.

సిద్ధంగా ఉన్నా:పాట్ కమ్మిన్స్
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాట్ కమ్మిన్స్ నిష్క్రమించిన తర్వాత స్టీవ్ స్మిత్ ఆ టోర్నమెంట్ కోసం ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా జట్టు తన ఛాంపియన్స్ ట్రోఫీ పోరును ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ తో ప్రారంభిస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ఐపీఎల్ లో ఆడడం గురించి పాట్ కమ్మిన్స్ కీలక వివరాలను వెల్లడించాడు. "ప్రస్తుతం ఇదే నా లక్ష్యం. టీ20లో ప్రతి బౌలర్ కు నాలుగు ఓవర్లు ఉంటాయి. కాబట్టి ఐపీఎల్ 2025 సీజన్ మ్యాచ్ ఫిట్‌నెస్ పొందడానికి అనువైన మైదానాన్ని అందిస్తుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్, తర్వాత జరిగే టెస్ట్ మ్యాచ్ లకు చాలా మంచి సన్నాహకం. ప్రస్తుతానికి లక్ష్యం ఏమిటంటే.. వచ్చే వారం బౌలింగ్ ప్రారంభించడం, ఐపీఎల్ వరకు సిద్ధం కావడం." అని పాట్ కమ్మిన్స్ అన్నాడు. అంటే ఈ ఐపీఎల్ లో పాట్ కమ్మిన్స్ సన్ రైజర్స్ జట్టుకు మరోసారి నాయకత్వం వహించే అవకాశం ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కమ్మిన్స్
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పాట్ కమ్మిన్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. గత సీజన్‌లో అతని కెప్టెన్సీలో జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉంది. దీంతో పాటు సన్ రైజర్స్ జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది, అయితే ఫైనల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో సన్‌రైజర్స్ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. 2024 ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ పాట్ కమ్మిన్స్‌ను రూ.20.5 కోట్లకు కొనుగోలు చేసింది. అదే సమయంలో సన్‌రైజర్స్ మరోసారి తమ కెప్టెన్‌పై విశ్వాసం వ్యక్తం చేసింది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు, ఫ్రాంచైజీ కమ్మిన్స్‌ను రూ.18 కోట్లకు నిలుపుకోవాలని నిర్ణయించింది.
పాట్ కమ్మిన్స్ ఐపీఎల్ కెరీర్
పాట్ కమ్మిన్స్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో మొత్తం 58 మ్యాచ్‌లు ఆడాడు. ఈ స్టార్ బౌలర్ తన బౌలింగ్ తో 63 వికెట్లు పడగొట్టాడు. పాట్ కమ్మిన్స్ 515 పరుగులు కూడా చేశాడు. ఐపీఎల్‌లో అతని అత్యుత్తమ ఇన్నింగ్స్ 66 పరుగులు. ఇది కాకుండా అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 34 పరుగులకు 4 వికెట్లు తీయడం.