India's tour of Australia: ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో పర్యటించబోతోంది భారత జట్టు. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అయిదు టెస్ట్ మ్యాచ్‌లను ఆడబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ఇదివరకే వెల్లడించింది. ఈ సిరీస్ తేదీలు, అవి ప్రారంభం అయ్యే టైమ్, వేదికలను ఖరారు చేసింది.
తొలి టెస్ట్ మ్యాచ్ నవంబర్ 22వ తేదీన జరుగుతుంది. దీనికి పెర్త్ ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2:20 నిమిషాలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. రెండో టెస్ట్- డిసెంబర్ 6వ తేదీన అడిలైడ్, మూడో మ్యాచ్- 14వ తేదీన బ్రిస్బేన్, 4వ మ్యాచ్- 26వ తేదీన మెల్‌బోర్న్‌లో షెడ్యూల్ అయ్యాయి. చివరి టెస్ట్ మ్యాచ్ వచ్చే ఏడాది జనవరి 3వ తేదీన ఉంటుంది. దీనికి సిడ్నీ వేదిక.

ఈ సిరీస్‌లో భాగంగా భారత జట్టు.. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ 11తో డే/నైట్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడబోతోంది. ఇది పింక్ బాల్ మ్యాచ్. క్యాన్ బెర్రా స్టేడియం ఈ అరుదైన మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌ల మధ్య ఉండే గ్యాప్‌లో అంటే నవంబర్ 30, డిసెంబర్ 1వ తేదీల్లో ఈ మ్యాచ్‌లు ఉంటాయి.
ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ఆస్ట్రేలియా కేప్టెన్ పాట్ కమ్మిన్స్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నాడు. రెండు నెలల పాటు విరామం తీసుకోబోతోన్నాడు. క్రికెట్‌కు దూరంగా ఉండబోతోన్నాడు. శారీరకంగా, మానసికంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా గడపాలనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు.
సమవుజ్జీ అయిన టీమిండియాను తన సొంతగడ్డపై ఎదుర్కొనాల్సి ఉండటం, జట్టుకు నాయకత్వాన్ని వహిస్తోండటం, యాషెస్‌తో సమానంగా బోర్డర్- గవాస్కర్ ట్రోఫీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోన్నందున- ఎలాంటి అలసత్వం ప్రదర్శించకూడదగెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాడు పాట్ కమ్మిన్స్.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నుంచి వరుసగా అన్ని మ్యాచ్‌లు, సిరీస్‌లల్లో ఆడుతూ వస్తోన్నాడు పాట్ కమ్మిన్స్. నాన్‌స్టాప్ బౌలింగ్ చేస్తోన్నాడు. ఇప్పుడు మళ్లీ భారత్‌తో ఏకంగా అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనాల్సి ఉన్నందున విరామం తీసుకోవాలనుకుంటోన్నానని చెప్పాడు.