
బ్రిస్బేన్: గబ్బా టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (7; 15 బంతుల్లో 1x4) ఔటయ్యాడు. పాట్ కమిన్స్ వేసిన 6.2వ ఓవర్‌కు స్లిప్‌లో స్టీవ్ స్మిత్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ 11 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. సిడ్నీ టెస్టులో గిల్ రాణించిన విషయం తెలిసిందే. దీంతో అతడిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే నాలుగో టెస్టులో మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. సింగల్ డిజిట్‌కే పెవిలియన్ చేరాడు.
శుభ్‌మన్ గిల్ అనంతరం చేటేశ్వర్ పుజారా క్రీజులోకి వచ్చాడు. ఇక సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆచితూచి ఆడుతున్నాడు. ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ పరుగులు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. పుజారా కూడా క్రీజులో పాతుకుపోవడానికి చూస్తున్నాడు. 12 ఓవర్లకు భారత్ స్కోర్ 26/1గా నమోదైంది. క్రీజులో రోహిత్ (15), పుజారా (3) పరుగులతో ఉన్నారు. పాట్ కమిన్స్ ఒక వికెట్ పడగొట్టాడు.
అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది. శనివారం 274/5తో రెండో రోజు ఆట కొనసాగించిన ఆతిథ్య జట్టు మరో 95 పరుగులు చేసి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ టిమ్ పైన్ (50; 104 బంతుల్లో 6x4), కామెరూన్ గ్రీన్ (47; 107 బంతుల్లో 6x4) రాణించారు. తొలి రోజు ఆటలో మార్నస్ లబుషేన్ (108; 204 బంతుల్లో 9x4) శతకం సాధించిన సంగతి తెలిసిందే. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకుర్, వాషింగ్టన్ సుందర్, టీ నటరాజన్ మూడేసి వికెట్లు పడగొట్టారు.