
క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా తిలకించే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో రెండో టెస్ట్‌కు రంగం సిద్ధమైంది. ఆడిలైడ్ వైదికగా బుధవారం నుంచి ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో అతిథ్య ఆస్ట్రేలియా జట్టు రెండో టెస్టుకు 11 మందితో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఈ జట్టు వివరాలు వెల్లడించాడు. పక్కటెముకల నొప్పితో బాధపడుతున్న ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ రేపటి నుంచి ప్రారంభం కాబోయే రెండో టెస్టులో వార్నర్ ఆడుతున్నాడని ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ ప్రకటించాడు. అయితే గాయం కారణంగా స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ మాత్రం ఈ టెస్ట్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో జైరిచర్డ్‌సన్ బరిలోకి దిగనున్నాడు. కాగా రిచర్డ్‌సన్‌కు యాషెస్ సిరీస్‌లో ఇదే తొలి టెస్టు కానుంది. మిగతాది అంతా మొదటి టెస్టులో ఆడిన ఆటగాళ్లతోనే కంగారులు బరిలోకి దిగనున్నారు.
ఆడిలైడ్ వేదికగా పింక్ బాల్‌తో జరగనున్న ఈ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌లో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. గబ్బా వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో అతిథ్య ఆస్ట్రేలియా ఏకపక్ష ఆటతీరుతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో ఆసీస్ 9 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో 5 టెస్ట్‌ల యాషెస్ సిరీస్‌లో ఆ జట్టు 1-0తో అధిక్యంలోకి దూసుకెళ్లింది. దీంతో రెండో టెస్టులోనూ అదే ఆటతీరు ప్రదర్శించాలని కంగారు జట్టు భావిస్తోంది. రెండో టెస్టులోనూ గెలిచి అధిక్యాన్ని 2-0 కు పెంచుకోవాలని భావిస్తోంది. ఇక తొలి టెస్టులో ఓడిన పర్యాటక జట్టు ఇంగ్లండ్ మాత్రం ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలిచి తొలి టెస్టు ఓటమికి ప్రతికారం తీర్చుకోవాలని తపన పడుతోంది. మొదటి టెస్టులోని లోపాలను సరి చేసుకోవడంపై దృష్టి పెట్టిన రూట్ సేన రెండో టెస్టులో వాటిని అధిగమించాలని భావిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ హోరాహోరిగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, మార్కస్ హారిస్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జై రిచర్డ్‌సన్.