మరో నెల రోజుల్లో టీమిండియా టెస్టు ఫార్మాట్ సందడి మొదలుకానుంది. స్వదేశంలో సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు, అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు భారత్ ఆడనుంది. అనంతరం ఈ ఏడాది ఆఖర్లో ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా అయిదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే భారత్‌కు ఈ సిరీస్‌ల్లో విజయం తప్పనిసరి.
కంగారూల గడ్డపై గత రెండు బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత్ ఈ సారి కూడా ఫేవరేట్‌గానే బరిలోకి దిగుతోంది. 2016 నుంచి టీమిండియానే ఈ ట్రోఫీని వరుసగా గెలుస్తున్న విషయం తెలిసిందే. 2016/17, 2022/23లో భారత్, 2018/19, 2020/21లో ఆస్ట్రేలియా ఈ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చింది.

అయితే ఈసారి తమ సొంతగడ్డపై జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆల్‌రౌండర్లు కీలకపాత్ర పోషిస్తారని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జోస్యం చెప్పాడు. తమ స్టార్ ఆల్‌రౌండర్లు కామెరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్ గేమ్ ఛేంజర్లు అవుతారని అభిప్రాయపడ్డాడు. ఈ ఇద్దరి వల్ల తమకు ఆరుగురు బౌలర్ల ఆప్షన్లు ఉంటాయని తెలిపాడు.
నాథన్ లైయన్‌కు ఎక్కువ ఓవర్లు వేసే సామర్థ్యంతో నలుగురు బౌలర్లు సరిపోతారని, కానీ ఆల్‌రౌండర్లతో అదనపు అవకాశాలు వచ్చాయని కమిన్స్ పేర్కొన్నాడు.
కాగా, భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌ను ఉద్దేశించి లైయన్, హేజిల్‌వుడ్ కూడా మాట్లాడారు. యశస్వీ జైస్వాల్ ప్రమాదకర బ్యాటర్ అని, జైస్వాల్ జోరుకు బ్రేక్‌లు వేయడానికి సిద్ధంగా ఉన్నామని లైయన్ పేర్కొన్నాడు. మరోవైపు హేజిల్‌వుడ్ మాట్లాడుతూ.. సొంతగడ్డపై ఆడటం తమ అదనపు బలంగా మారుతుందని హేజిల్‌వుడ్ అన్నాడు.
నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా అయిదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టు పెర్త్ వేదికగా నవంబర్ 22-26 వరకు జరగనుంది. అలాగే అడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్టు డిసెంబర్ 6-10 వరకు, బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 14-18 వరకు మూడో టెస్టు, డిసెంబర్ 26-30 వరకు బాక్సింగ్ డే టెస్టు, సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి 7 వరకు ఆఖరి టెస్టు జరగనుంది.