
హైదరాబాద్: రెండేళ్ల విరామం తర్వాత తిరిగి ఐపీఎల్‌లోకి అడుగుపెడుతోన్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే బాల్ టాంపరింగ్ వివాదంతో ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించడంతో ఐపీఎల్‌కు దూరమైన సంగతి తెలిసిందే.
దీంతో స్మిత్ స్థానంలో కొత్త కెప్టెన్‌గా అజ్యింకె రహానేను యాజమాన్యం నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఆస్ట్రేలియా ఆటగాడు డార్సీ షార్ట్ ఆలస్యంగా జట్టులో చేరనున్నాడు. ఇందుకు కారణం అతడు తన పాస్ పోర్ట్‌ని ఎక్కడో పోగట్టుకోవడమే. మరో ఐదు రోజుల్లో ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో ఆయా జట్లకు చెందిన విదేశీ ఆటగాళ్లు ఇప్పటికే భారత్‌కు వచ్చి తమ తమ జట్లతో కలిసి నెట్ ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొనడాన్ని మనం చూస్తున్నాం. అయితే, రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ఆటగాడు షార్ట్ తన పాస్‌పోర్టు పోగొట్టుకోవడంతో కాస్త ఆలస్యంగా భారత్ రానున్నాడని ఆ జట్టు యాజమాన్యం తెలిపింది.
'కొద్ది రోజుల క్రితం షార్ట్ ఎక్కడో తన పాస్‌పోర్టును పారేసుకున్నాడు. కొత్త దానికి దరఖాస్తు చేశాడు. గుడ్‌ఫ్రైడే, ఈస్టర్, వారాంతపు సెలవులు రావడంతో అతడి పాస్‌పోర్టు పని కాస్త ఆలస్యం అయ్యింది' రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది.
డార్సీ షార్ట్ ఎంత దురదృష్టవంతుడంటే... అతడి పాస్ పోర్ట్‌ను అధికారులు రోడ్డు మార్గంలో పంపిస్తున్నారంట. దీంతో ఆ పాస్ పోర్ట్ అతడి చేతికి అందాలంటే మరికొన్ని రోజులు పట్టనుంది. దీంతో అతడు భారత్‌కు వచ్చేందుకు మరికొన్ని రోజుల సమయం పట్టనుంది. వచ్చే ఆదివారం (ఏప్రిల్ 8న) నాటికి షార్ట్ భారత్ వచ్చే అవకాశం ఉంది.
ఈ ఏడాది జనవరిలో బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు డార్సీ షార్ట్‌ను రూ.4 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 11వ సీజన్ ఏప్రిల్ 7న ప్రారంభం కానుంది. టోర్నీలో భాగంగా ఏప్రిల్ 9న సోమవారం రాజస్థాన్ రాయల్స్ తన తొలి మ్యాచ్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.